ఈసారి జీడీపీ గ్రోత్7.4శాతం..ఇది ప్రపంచంలోనే అత్యధికం

ఈసారి జీడీపీ గ్రోత్7.4శాతం..ఇది ప్రపంచంలోనే అత్యధికం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వాస్తవ వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 6.5 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఎక్కువ. తయారీ, సేవల రంగాల అండతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతున్నదని తెలిపింది.  

న్యూఢిల్లీ: ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో  జీడీపీ వాస్తవ వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం విశేషం. 2025లో నమోదైన 6.5 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఎక్కువ. తయారీ, సేవల రంగాల అండతో ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని తెలిపింది. కేంద్రం బుధవారం 2026 మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 

దీని ప్రకారం.. ఈ ఏడాది దేశ నామినల్ గ్రోత్​ ఎనిమిది శాతంగా ఉండవవచ్చు. ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో 7.8 శాతం వృద్ధి నమోదు కాగా, రెండో క్వార్టర్ లో 8.2 శాతం వృద్ధి కనిపించింది.  మిగిలిన ఆరు నెలల్లో (హెచ్​2) సగటు వృద్ధి 6.8 శాతానికి తగ్గే అవకాశం ఉంది.  ఆర్​బీఐ 2025 డిసెంబర్​లో వెల్లడించిన అంచనాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.3 శాతంగా ఉండవచ్చు.   

తయారీ రంగం దూకుడు

ఈసారి  తయారీ, సేవల రంగాల వృద్ధి జోరుగా సాగనుందని తెలుస్తోంది. 2025లో  4.5 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరుతుందని అంచనా. వ్యవసాయ రంగంలో మాత్రం కొంత నెమ్మది కనిపిస్తోంది. గత ఏడాది 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ రంగ వృద్ధి ఈ ఏడాది 3.1 శాతానికి పరిమితం కావచ్చని అంచనా. గనులు, తవ్వకాల రంగం గత ఏడాది 2.7 శాతం వృద్ధిని నమోదు చేసినా ఈ ఏడాది 0.7 శాతం మేర ప్రతికూల వృద్ధి ఉండవచ్చు.

సేవా రంగం వృద్ధి 9.1 శాతం వరకు

సేవల  రంగానికి ప్రాతినిధ్యం వహించే తృతీయ (టెర్షియరీ) రంగం వృద్ధి 7.2 శాతం నుంచి 9.1 శాతానికి వేగంగా పుంజుకోవచ్చు. ఫైనాన్షియల్​, రియల్టీ, ప్రొఫెషనల్ ​సర్వీసెస్​ వంటి విభాగాలు 9.9 శాతం మేర పెరగవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ వంటి సేవలు కూడా 9.9 శాతం వృద్ధిని సాధించనున్నాయి. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ కేటగిరీ గత ఏడాది 6.1 శాతం నుంచి ఈ ఏడాది 7.5 శాతానికి మెరుగుపడనుంది.

 ప్రజల వినియోగ వ్యయాన్ని ప్రతిబింబించే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్​ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెండిచర్ వృద్ధి గత ఏడాది 7.2 శాతం ఉండగా, ఈసారి ఏడు శాతానికి   తగ్గుతుందని అంచనా. పెట్టుబడుల పరిస్థితిని తెలిపే గ్రాస్ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్ వృద్ధి 7.1 శాతం నుంచి 7.8 శాతానికి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.