ఫిబ్రవరి 16 నుంచి టెన్త్ స్టూడెంట్స్ కు స్నాక్స్.. రూ.4.23 కోట్లు మంజూరు: తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

ఫిబ్రవరి 16 నుంచి టెన్త్ స్టూడెంట్స్ కు స్నాక్స్.. రూ.4.23 కోట్లు మంజూరు: తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కారు నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు.. మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్‌‌ నిధుల నుంచి రూ.4.23 కోట్లు మంజూరు చేశారు.

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని సర్కారు నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు.. మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్‌‌ నిధుల నుంచి రూ.4.23 కోట్లు మంజూరు చేశారు. 

గవర్నమెంట్, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు వీటిని అందించనున్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్‌‌ను వెంటనే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుంచి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్​లోనే ఉండే పేద విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ నిధులు కేటాయించినట్టు నవీన్ నికోలస్ చెప్పారు. 

కాగా, గతేడాది టెన్త్ విద్యార్థులకు 39 రోజుల పాటు స్నాక్స్ అందించారని, ఈ ఏడాది కేవలం 19 రోజులే ఇవ్వడం సరికాదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అన్నారు. ఈ ఏడాది కూడా 45 రోజులు స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.