
- వరద సాయానికి రూ. 500 కోట్లు ఇచ్చినం: ప్రశాంత్రెడ్డి
- కేంద్రం సాయం చేయకున్న రాష్ట్రమే ఖర్చు చేస్తున్నది
- మోరంచపల్లిలో కూలింది16 ఇండ్లేనన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: కేంద్రం సాయం చేయకున్నా.. కరోనా సమయంలో, వర్షాలు, వరదల సమయంలో సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఫొటోలకు ఫోజులిచ్చే నాయకుడు కేసీఆర్ కాదని, ప్రజలకు పనికి వచ్చే పనులు చేసే నాయకుడని చెప్పారు. కొందరు వరదలపై బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు, జరిగిన నష్టంపై గురువారం శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో మంత్రి మాట్లాడారు. పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు.
హెలికాప్టర్‌తో వరద సహాయ చర్యలు
జులై 18 నుంచి 22వ తేదీ వరకు, జులై 24 నుంచి 28 తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సగటు వర్షపాతం కంటే 66% ఎక్కువ వానలు పడ్డాయన్నారు. భారీ వర్షాలతో 756 చెరువులు, ప్రాజెక్టులకు గండ్లుపడ్డాయని, 1,517 రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. 773 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. 419 ఇండ్లు పూర్తిగా దెబ్బతినగా.. 7,505 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు. 157 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 27వేల మందికి ఆశ్రయం కల్పించామన్నారు. వరద సాయం కోసం 8 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు, 18 ఫైర్ టీమ్‌లు, 16 రిలీఫ్ వెహికల్స్ ఏర్పాటు చేశామన్నారు. హెలికాప్టర్లతో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలలో వరద సహాయక చర్యలు చేపట్టామని వివరించారు.
మోరంచపల్లిలో కుటుంబానికిరూ.2,500 ఇచ్చినం
మోరంచపల్లిలో 3 గంటల్లో 48 సెంటీమీటర్ల వర్షం పడడంతో భారీ నష్టం జరిగిందని మంత్రి చెప్పారు. ఆ ఊరిలో 16 ఇండ్లు పూర్తిగా కూలిపోగా, 75 ఇండ్లు పాక్షికంగా కూలాయని చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ఊరు మొత్తం స్మాష్ అయినట్టు ప్రచారం చేశాయని చెప్పారు. ఆ ఊర్లో రెండు రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.2500 చొప్పున అందించామన్నారు. రాష్ట్రంలో వరద సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేశామని, అవసరమైతే ఇంకా ఇస్తామన్నారు. గతేడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం ప్రకటించామన్నారు. దాని కోసం రైతులకు రూ.150 కోట్లు ఇచ్చామని, మిగితావి కూడా తర్వరలో ఇస్తామన్నారు.