మేఘా టెండర్లు రద్దు చేయాలి

మేఘా టెండర్లు రద్దు చేయాలి
  • దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ప్రాజెక్టులు కడుతున్నరు: వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్ జేబులో, ఆయన గడీలో తెలంగాణ బంధీ: కోదండరాం
  • కృష్ణాలో 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నరు: జితేందర్ రెడ్డి
  • ‘టర్నింగ్ ఏ రివర్’  పేరుతో ఏపీ అక్రమ ప్రాజెక్టులు చూపాలె: గవినోళ్ల శ్రీనివాస్
  • కృష్ణా నీళ్లపై టీ జర్నలిస్టుల ఫోరం అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌‌, వెలుగు: దక్షిణ తెలంగాణను ఎడారి చేసే సంగమేశ్వరం ఎత్తిపోతలు సహా ఆంధ్రాలో అనేక ప్రాజెక్టులు కడుతున్న మేఘా సంస్థ తెలంగాణలో చేపట్టిన కాంట్రాక్టులను రద్దు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌ కమిటీ మెంబర్‌‌ వివేక్‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌ చేశారు. భారీ ప్రాజెక్టులు కట్టి కమీషన్లు దండుకోవడానికి ఇద్దరు సీఎంలు మేఘా కృష్ణారెడ్డిని ఎంచుకున్నారన్నారు. కృష్ణా నీళ్లలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుందో సీఎం కేసీఆర్‌‌కు తెలిసినా కమీషన్లు దోచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కృష్ణాలో 299 టీఎంసీలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. మంగళవారం టీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ‘కృష్ణా జలాల న్యాయమైన వాటా, పెండింగ్‌‌ ప్రాజెక్టుల సత్వర పూర్తి’పై వివేక్‌‌ మాట్లాడారు. కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌‌కు అక్రమంగా తరలించేందుకు ప్రాజెక్టులను జగన్‌‌ ఎప్పుడో మొదలు పెట్టినా సీఎం కేసీఆర్‌‌ ఇన్నాళ్లూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టేందుకు జగన్‌‌ జీవోలిచ్చినప్పుడు సీఎం ఫాం హౌస్‌‌లో పడుకున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌‌ ఇరిగేషన్‌‌ దందా చేస్తున్నరు

కేసీఆర్‌‌ ఇరిగేషన్‌‌ దందా చేస్తున్నారని, రాష్ట్ర సంపదను కుటుంబసభ్యులకు దోచిపెడుతున్నారని వివేక్‌‌ ఆరోపించారు. రూ.36 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతకు పెరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రాజెక్టుల పనుల్లో దండుకున్న కమీషన్లను జగన్‌‌ ఎన్నికల ఖర్చు కోసం ఇచ్చారని ఆరోపించారు. ఆంధ్రాలో గెలిచే వైసీపీ ఎంపీల మద్దతుతో ఉప ప్రధాని కావాలని కేసీఆర్‌‌ కలలు కన్నారని, ఇక్కడ కొడుకును సీఎం చేద్దామని చూశారని చెప్పారు. హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో మంత్రులు ఇప్పుడు ఏపీ ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపేందుకు బీజేపీ పార్టీ పక్షాన కేంద్రంపై తాము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారో, ఈ ఏడేళ్లలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో వైట్‌‌ పేపర్‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. ఎత్తిపోసిన నీళ్లకు కరెంట్‌‌ బిల్లు మనం కడుతుంటే, వరదలు ఎక్కువై వాటిని సముద్రంలోకి వదులుతున్నారన్నారు.

12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి: మల్లు రవి

పాలమూరులో కాంగ్రెస్‌‌ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌‌ నేత మల్లు రవి అన్నారు. బేసిన్‌‌లోని నీళ్లపై ఆ ప్రాంత ప్రజలకు హక్కులుంటాయని, అలాంటిది బేసిన్‌‌లు లేవు.. భేషజాల్లేవని కేసీఆర్‌‌ ఎట్లా మాట్లాడతారని మండిపడ్డారు. రోజా ఇంట్లో రాగి సంకటి తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనడం ఏపీకి అనుకూలంగా మారిందన్నారు.  

ఆంధ్రా కాంట్రాక్టర్లను తరిమి కొట్టాలి: పాశం యాదగిరి

పోలవరం కోసం 10 మండలాల ప్రజలను ముంచేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖజానా ఖాళీ చేశారని కేసీఆర్‌‌పై సీనియర్‌‌ జర్నలిస్టు పాశం యాదగిరి మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌‌లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం మరో ఉద్యమం రావాలని, ఆంధ్రా కాంట్రాక్టర్లకు తరిమి కొట్టాలన్నారు. రాష్ట్రాన్ని లూఠీ చేసే వారి మీద లాఠీలు ఝలిపించాలన్నారు. తెలంగాణ దోపిడీ వెనుక కేవీపీ రామచందర్‌‌రావు ఉన్నారన్నారు.

అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే నీళ్ల లొల్లి: లక్ష్మీనారాయణ

కేసీఆర్‌‌ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే నీటి వివాదాలను తెరపైకి తెచ్చారని రిటైర్డ్‌‌ ఇంజనీర్‌‌ దొంతుల లక్ష్మీనారాయణ అన్నారు. షర్మిలను జగన్‌‌ కట్టడి చేయడం లేదనే కోపంతోనే మంత్రులతో ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారు.

సెంటిమెంట్‌‌ రగిలితే వాళ్లకే లబ్ధి: మాజీ ఎమ్మెల్యే సంపత్‌‌కుమార్‌‌
పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, ఆర్డీఎస్‌‌ కుడి కాలువ తవ్వకంలో ప్రభుత్వం ఫెయిల్‌‌ అయిందనే విషయంపైనే మనం ఫోకస్‌‌ చేస్తే.. ఇది సెంటిమెంట్‌‌ను రగిలిస్తుందని మాజీ ఎమ్మెల్యే సంపత్‌‌కుమార్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సెంటిమెంట్‌‌తో రేపు హుజూరాబాద్‌‌లో, 2023లో అధికారంలో ఉన్నోళ్లకే ప్రయోజనం కలగవచ్చన్నారు. పులి రక్తం తాగడానికి అలవాటు పడ్డట్టే కల్వకుంట్ల కుటుంబం కమీషన్లు తినడానికి అలవాటు పడిందని విమర్శించారు.

టర్నింగ్‌‌ ఏ రివర్‌‌ పేరుతో చూపాలె: గవినోళ్ల

‘లిఫ్టింగ్‌‌ ఏ రివర్‌‌ పేరుతో ఒక ఇంగ్లిష్‌‌ చానల్‌‌ ఓ ప్రాజెక్టును గొప్పగా చూపించింది. కొన్ని రోజుల్లో అదే చానల్‌‌ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులతో ఎండిన తమ డొక్కల్ని, బీడు పడిన తమ భూముల్ని టర్నింగ్‌‌ ఏ రివర్‌‌ పేరుతో చూపించాల్సిన అవసరం ఉంది’ ఎన్‌‌జీటీలో పిటిషన్‌‌ వేసిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌‌ అన్నారు. తమకు డబ్బులు, పదవులు అక్కర్లేదని, నీళ్లిస్తే చాలని కోరారు. పాలమూరు దరిద్రాన్ని ప్రపంచ బ్యాంకుకు చూపి అప్పులు తెచ్చి వాటిని ఎక్కడెక్కడో ఖర్చు చేశారని, పాలమూరు ఉసురు అందరికీ తగులుతుందన్నారు. సంగమేశ్వరంపై ఎన్‌‌జీటీలో న్యాయపోరాటానికి ‘‘వీ6 వెలుగు’’ తనకు అండగా నిలిచిందన్నారు. 

ఇద్దరు సీఎంలు డ్రామాలాడుతున్నరు: దాసోజు

ఇద్దరు సీఎంలు డ్రామాలాడుతున్నారని, నీళ్ల పంచాయితీని ముందు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌‌ విమర్శించారు. వైఎస్‌‌కు హారతి పట్టిన సన్నాసులా నీతులు చెప్పేది అంటూ విమర్శలు చేసే కేసీఆర్‌‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌‌ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణ ఎడారి అవుతుందని కల్వకుర్తి జలసాధన సమితి కన్వీనర్‌‌ లింగయ్య అన్నారు. సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్‌‌, టీడీపీ మహిళా అధ్యక్షులు జ్యోత్స్న, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ నాయకుడు బాల మల్లేశ్‌‌, జై స్వరాజ్‌‌ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు, సతీశ్‌‌ కమాల్‌‌ తదితరులు పాల్గొన్నారు.