ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు
  • కార్మికులకు వరాలు.. సామాన్యులపై భారం
  • రేపే సెప్టెంబర్ నెల జీతం.. సమ్మె కాలానికీ జీతం
  • బాగా పనిచేస్తే బోనస్.. ఏడాది లక్ష తీసుకోవాలే
  • రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు

హైదరాబాద్: 52 రోజుల పాటు సమ్మె తర్వాత తిరిగి విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో భేటీ అయిన సీఎం కేసీఆర్ వారిపై వరాల జల్లు కురిపించారు. సమ్మె వల్ల పెండింగ్‌లో పడిన సెప్టెంబరు నెల జీతాన్ని రేపే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె కాలం నాటి జీతం కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఆ శాలరీల చెల్లింపుపై అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం. మహిళా ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిపోల్లో వారికి కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని ఆధికారులకు సూచించారు కేసీఆర్. ఆయన ప్రసంగం సందర్భంగా పలుమార్లు కార్మికులు చప్పట్లు కొడుతూ.. కేసీఆర్ జిందాబాద్ అంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఏటా లక్ష బోనస్ తీసుకుేనేలా పనిచేయాలే

నవంబరు 25న సమ్మె ముగించి విధుల్లో చేరుతామని జేఏసీ కోరిన తర్వాత మూడు రోజులకు 28న రాత్రి ‘మీరు నా బిడ్డలు.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే అవకాశం ఉన్నా చేయట్లే. డ్యూటీలో చేరండి’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తిరిగి డ్యూటీ ఎక్కిన ఆర్టీసీ కార్మికుల్లో కొంతమందిని జిల్లాల వారీగా పిలిపించి.. ఇవాళ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి కొన్ని సూచనలు చేయడంతో పాటు వరాలు కురిపించారాయన. ఆర్టీసీ మనుగడ కోసం కష్టపడి పని చేయాలని, సంస్థను అభివృద్ధిలో తేవాలని సూచించారు. మంచి ఫలితాలు సాధిస్తే సింగరేణి కార్మికుల మాదిరిగా బోనస్ ఇస్తామని చెప్పారు సీఎం. కార్మికులు ఏటా లక్ష రూపాయల బోనస్ తీసుకునేలా పనియేయాలని అన్నారాయన.

ప్రైవేటుకివ్వం

సెప్టెంబరు నెల జీతం రేపే చెల్లించేలా ఆధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే, కార్మికుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచుతామని చెప్పారు సీఎం. రాష్ట్రంలో ప్రస్తుతం పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగా ఉండగా ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులకు  మరో రెండేళ్లు అదనంగా సర్వీసులో ఉండే అవకాశం రాబోతోంది. ఒక్క ప్రైవేటు బస్సును కూడా అనుమతించబోమని హామీ ఇచ్చారు కేసీఆర్. రూట్ల ప్రైవేటీకరణ చేయబోమని తెలిపారు.

కండక్టర్ల బదులు ప్యాసింజర్‌కు ఫైన్

ఇప్పటి వరకు బస్సుల్లో ప్రయాణికులు టికెట్ తీసుకుండా ప్రయాణిస్తూ స్క్వాడ్‌కు పట్టుబడితే దానిలో కండక్టర్‌కు జరిమానా పడేది. ఈ నిబంధనను కూడా మారుస్తామని సీఎం కేసీఆర్ కార్మికులకు తెలిపారు. రేపటి నుంచే కండక్టర్‌కు బదులు ఆ ఫైన్ ప్రయాణికులపై వేస్తామని చెప్పారు.

MORE NEWS: 

సమ్మె విరమించిన ఆర్టీసీ జేఏసీ
కండీషన్లు పెట్టం.. ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరండి: సీఎం కేసీఆర్
ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

52 రోజుల సమ్మె తర్వాత.. సామాన్యులపై బాదుడు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు పలు డిమాండ్లతో అక్టోబరు 5న ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నాటి నుంచి 52 రోజుల పాటు సమ్మె జరిగింది. కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి మద్దుతు వచ్చింది. కానీ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు కార్మికులు. సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వారాల క్రితం కేసును లేబర్ కోర్టుకు రెఫర్ చేయాలని, చర్చలు జరపాలని కానీ, కార్మికుల డిమాండ్లు ఆమోదించాలని కానీ తాము ప్రభుత్వానికి సూచించలేమని కోర్టు చెప్పింది.

దీంతో నవంబరు 25న సమ్మె విరమించి విధుల్లో చేరుతామని ప్రకటించారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. కానీ, ఆ రోజున డ్యూటీలోకి తీసుకోబోమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పారు. లేబర్ కోర్టు నిర్ణయం వచ్చే వరకూ ఆగాలన్నారు. అయితే 28న రాత్రి కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి విధుల్లో చేరాలని కార్మికులను ఆదేశించారు. అయితే సమ్మి విరమణ తర్వాత సామాన్యులపై భారం వేయడానికి సిద్ధమైంది కేసీఆర్ సర్కారు. ఆర్టీసీ టికెట్ ధరలు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులపై భారీగా భారం పడబోతోంది. ఇప్పటి వరకు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల్లో రూ.5 ఉన్న కనీస చార్జీని రూ.10కి పెంచబోతోంది ప్రభుత్వం. కొత్ చార్జీలు సోమవారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.