డ్యూటీలో చేరాలని కార్మికులపై ఒత్తిడి..అయినా ఒక్కరూ చేరలేదు!

డ్యూటీలో చేరాలని కార్మికులపై ఒత్తిడి..అయినా ఒక్కరూ చేరలేదు!

అయినా ఒక్కరూ చేరలేదు: అశ్వత్థామరెడ్డి

ఉమ్మడి ఏపీ బాకీ అయితే మన వాటా ఎందుకియ్యలేదని ప్రశ్న

 సభ పెడ్తమంటే సర్కార్‌ భయపడుతోంది: రాజిరెడ్డి

జీతాల చెల్లింపుపై మరో పిటిషన్‌ వేస్తం: హనుమంతు

డ్యూటీలో చేరాలంటూ డిపోల వారీగా కార్మికులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారని, అయినా ఏ ఒక్కరూ డ్యూటీలో చేరలేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలో 2009 నుంచి 2014 వరకు రూ.1,099 కోట్లు ఆర్టీసీకి రావాల్సి ఉందని, 2014 నుంచి 2019 వరకు రూ.1,375 కోట్ల బస్‌పాస్‌ల సబ్సిడీ రావాల్సి ఉందని, మున్సిపల్‌ చట్టం ద్వారా రూ.1,496 కోట్లు రావాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ బకాయిలు అయితే తెలంగాణ వాటా ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆర్టీసీ సమ్మెపై విచారణ తర్వాత ఆయన హైకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి ఎక్కువ డబ్బులే ఇచ్చామని ప్రభుత్వం హైకోర్టులో చెప్పిందని, లెక్కలు సరిగా లేకపోవడంతో చీఫ్‌ జస్టిస్‌ సంతృప్తి చెందలేదని తెలిపారు.

ఉమ్మడి ఏపీలో రూ.1,099 కోట్లు బాకీ ఉంటే, 42 శాతం వాటా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని, 2014 నుంచి ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారన్నారు. వెంటనే అవసరమైన రూ.49 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వకుంటే సంస్థను ఎలా కాపాడతారని కోర్టు మండిపడిందన్నారు. అసలు ప్రభుత్వం నుంచి యాజమాన్యానికి డబ్బులు చెల్లించాలా లేదా.. గతంలో ఏ రూపంలో ఇచ్చారు.. ఎన్ని ఇచ్చారనే వివరాలు ఇవ్వాలని తమ అడ్వొకేట్‌ కోరారన్నారు. ప్రభుత్వం సోమవారానికి వాయిదా కోరిందని, బెంచ్ మాత్రం శుక్రవారానికి వాయిదా వేసిందని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

తప్పులు బయటపడతాయనే భయం: రాజిరెడ్డి

రాజకీయాలకు సంబంధం లేకుండా ఆర్టీసీ కార్మికులు సభకు అనుమతి అడిగితే ప్రభుత్వం బెంబేలెత్తిపోతోందని ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్‌ రాజిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం తప్పులు బయటపడతాయని భయపడుతోందన్నారు. కొన్ని షరతులతో సభకు కోర్టు పర్మిషన్‌ ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు కుటుంబాలతో వచ్చి సకల జనుల సమరభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వెంటనే సెప్టెంబర్‌ జీతం ఇయ్యాలె: హనుమంతు

ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చేలా ప్రభు త్వానికి ఆర్డర్స్‌ ఇవ్వాలని బుధవారం మరో పిటిషన్‌ వేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ వన్‌ కన్వీనర్‌ హనుమంతు ముదిరాజ్‌ తెలిపారు. జీతాల చెల్లింపునకు సంబంధించి కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసిందన్నారు. జీతాలు రాక, ఉద్యోగాలు లేక రోజుకో కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని, వెంటనే సెప్టెంబర్‌ జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సకల జనుల సమరభేరి సభను అడ్డుకుందామని చూశారని, కానీ కోర్టు అనుమతిచ్చిందని, సభను సక్సెస్​ చేయాలని ఆర్టీసీ కార్మికులను కోరారు.