ఆర్టీసీ చైర్మన్​గా బాజిరెడ్డి లేదా నాయిని!

ఆర్టీసీ చైర్మన్​గా బాజిరెడ్డి లేదా నాయిని!

హైదరాబాద్, వెలుగు: త్వరలో ఆర్టీసీ సంస్థకు చైర్మన్ ను నియమించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించినట్లు తెలిసింది. పరిశీలనలో నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ సమయంలో బాజిరెడ్డి గోవర్దన్​కు అవకాశం దక్కలేదు. దీంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని ఆయనకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ గా బాజిరెడ్డిని నియమిస్తారని చర్చ జరిగినా.. ఆ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్​ను నియమించే చాన్స్ ఉందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి నాయిని నర్మింహారెడ్డి పేరు కూడా ఈ పదవి రేసులో వినిపిస్తోంది.

త్వరలో పూర్తిస్థాయి ఎండీ

ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఐపీఎస్ ను నియమించాలా.. ఐఏ ఎస్ ను నియమించాలనే దానిపై చర్చ జరుగుతోంది. టీఎస్​ ఆర్టీసీ ఏర్పాడ్డాక ఐపీఎస్ అధికారిని కాకుండా సంస్థలో అనుభవం ఉన్న ఈడీని ఎండీగా రిక్రూట్ చేశారు. ఆయన తర్వాత ఇన్​చార్జి ఎండీగా ఐఏఎస్​ అధికారి సునీల్​శర్మను నియమించారు. ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు.