
- అసెంబ్లీ.. మూడు రోజులే!
- ఎల్లుండి సమావేశాలు ప్రారంభమయ్యే చాన్స్
- ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో ఉభయ సభల సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు సెషన్ ఉండొచ్చని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన శనివారం సాయంత్రమే రావొచ్చని ప్రచారం జరిగినా.. రాత్రి వరకు స్పీకర్, మండలి చైర్మన్ నుంచి ఎలాంటి నోటీస్ జారీ కాలేదు.
అసెంబ్లీ.. మూడు రోజులే!
కేంద్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతున్నదని, దీనిపై చర్చించి ఆ వివరాలన్నీ ప్రజలకు చెప్పేందుకు డిసెంబర్ నెలలో వారం పాటు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్టు సీఎంవో గతంలో ప్రకటించింది. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు, బీఆర్‌ఎస్ ఆవిర్భావం, ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సహా అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు బిజీగా ఉండటంతో అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు కుదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. క్రిస్మస్ పండుగకు ముందే సమావేశాలు ముగించాలని సీఎం సూచించినట్లు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే ఆదివారం సభ్యులకు సమావేశాల నిర్వహణపై సమాచారం ఇచ్చి, మంగళవారం నుంచి సెషన్ పెట్టే అవకాశమున్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని శనివారం అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. కేంద్ర ఆర్థిక విధానాలను లెక్కలతో చెప్పడంతోపాటు గవర్నర్‌కు చాన్స్‌లర్‌గా ఉన్న అధికారాలను తొలగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టొచ్చని అధికార పార్టీ ముఖ్యులు అంటున్నారు.