రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా చర్యలు చేపట్టాలి: కేసీఆర్

రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా చర్యలు చేపట్టాలి: కేసీఆర్
  • పాడైన చోట్ల ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలి.. 
  • వారంలోగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి
  • అధికారులు, ఇంజనీర్లకు సీఎం ఆదేశం
  • ఆర్‌ అండ్‌ బీలోనూ ఈఎన్సీల విధానం తీసుకురావాలని సూచన

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరి ఉంచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులు, ఇంజనీర్లను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలని సూచించారు. గురువారం ప్రగతి భవన్‌‌లో మంత్రులు, అధికారులు, ఇంజనీర్లతో ఆర్‌‌ అండ్‌‌ బీ, పంచాయతీ రాజ్‌‌ రోడ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్‌‌ రిఫార్మ్స్‌‌లో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచడానికి కొత్త రిక్రూట్‌‌మెంట్‌‌పై రివ్యూ చేశారు.

ఇంజనీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా విభిన్నమైన ఆలోచనలు చేయాలని, వర్షాలు, వరదలకు పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలని సూచించారు. ‘‘ఇతర డిపార్ట్‌‌మెంట్ల మాదిరిగానే ఆర్‌‌ అండ్‌‌ బీలోనూ ఈఎన్సీల విధానం తీసుకురావాలి. ప్రతి ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్‌‌ఈ, టెరిటోరియల్‌‌కు ఒక సీఈని నియమించాలి. పనులు పటిష్టంగా చేపట్టేందుకు అనువుగా ఎస్‌‌ఈలు, ఈఈల సంఖ్య ఎంత ఉండాలో నిర్ణయించాలి” అని చెప్పారు. డిపార్ట్‌‌మెంట్‌‌లో పెరుగుతున్న పనికి అనుగుణంగా వర్క్‌‌ డివిజన్‌‌ చేసి ప్రభుత్వానికి నివేదిస్తే వచ్చే కేబినెట్‌‌ భేటీలో చర్చించి ఆమోదిస్తామని సూచించారు.

రోడ్ల రిపేర్లకు టెండర్లు పిలిచి వారంలోగా యాక్షన్‌‌ ప్లాన్‌‌ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో కేజీ వీల్స్‌‌ ట్రాక్టర్లతో రోడ్లు పాడవుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కేజీ వీల్స్‌‌ ట్రాక్టర్లు రోడ్లపైకి రాకుండా కఠిన రూల్స్ తయారు చేయాలని, వాటిపై ట్రాక్టర్‌‌ ఓనర్లకు అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించారు. రోడ్ల విస్తరణకు ఆటంకంగా ఉన్న అటవీ భూముల సేకరణపై ఆ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. రోడ్లకు ఉపయోగించే మెటీరియల్‌‌ను హైదరాబాద్‌‌ నుంచే సమకూర్చుకోవాలని సూచించారు.

‘‘ఇరిగేషన్‌‌ తరహాలోనే ఆర్‌‌ అండ్‌‌ బీకి మెయింటనెన్స్‌‌ నిధులు పెంచాం. చిన్న పనుల కోసం హైదరాబాద్‌‌ వరకు రావాల్సిన అవసరం లేకుండా డీఈఈ, ఈఈ, ఎస్‌‌ఈ స్థాయిలో ఎవరి దగ్గర ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకు ఉంచాలో నిర్ణయించాలి. వర్షాలు, వరదలతో తెగిపోయిన రోడ్లు, సాధారణ రోడ్ల రిపేర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఆదేశాలిచ్చారు. ఇరిగేషన్‌‌ తరహాలోనే ప్రత్యేకంగా సాఫ్ట్‌‌వేర్‌‌ అప్లికేషన్‌‌ రూపొందించి నిత్యం రోడ్లను పర్యవేక్షించాలన్నారు. వచ్చే నెల రెండోవారంలోపు రోడ్ల రిపేర్లు పూర్తి కావాలని సూచించారు. రోడ్లు ఎక్కడ, ఏమూల పాడయ్యాయనే పూర్తి వివరాలు క్షేత్రస్థాయి ఇంజనీర్ల దగ్గర ఉండాలని స్పష్టం చేశారు.

రోడ్లు ఖాళీగా ఉంటలేవ్

తెలంగాణలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వ్యవసాయ అనుంబంధ రంగాలు ప్రగతి సాధిస్తున్నాయని, తద్వారా గ్రామాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. రైతు కుటుంబాలు రవాణా కోసం కార్లు, టూ వీలర్లు కొంటున్నాయని, ఇయ్యాల ఇంటికో బండి, వాడకో కారు ఉన్నదని చెప్పారు. దీంతో గతంలో మాదిరి రోడ్లు ఖాళీగా లేవని, నిరంతరం వాహనాలతో ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి నిర్వహణను చాలెంజ్‌‌గా తీసుకోవాలని, ప్రజల రవాణాకు సౌకర్యవంతమైన రోడ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రోడ్ల రిపేర్లను నిరంతర ప్రక్రియలా భావించాలన్నారు. రోడ్ల దూరాన్ని బట్టి ఇంజనీర్లు వర్క్‌‌ డివిజన్‌‌ చేసుకోవాలని  ఆదేశించారు.