మళ్లీ గెలిపిస్తే.. పటాన్‌‌చెరుకు మెట్రో

మళ్లీ గెలిపిస్తే.. పటాన్‌‌చెరుకు మెట్రో
  • తొలి కేబినెట్‌‌ మీటింగ్‌‌లోనే నిర్ణయం తీసుకుంటం: కేసీఆర్
  • కొల్లూరులో డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీ
  • సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ

సంగారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌ను మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో సేవలు కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు బాగా రద్దీగా ఉన్న ప్రాంతమని, స్థానికుల కోరిక మేరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లోనే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరు, వేల్మెల, పటాన్ చెరు ప్రాంతాల్లో గురువారం కేసీఆర్ పర్యటించారు. కొల్లూరులో రూ.1,489.29 కోట్లతో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి.. లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

 వేల్మెలలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. తర్వాత పటాన్ చెరు టౌన్‌‌‌‌లో రూ.185 కోట్లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పటాన్ చెరు సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు వస్తున్నందున దుష్టశక్తులు ప్రజల మధ్య తిరుగుతున్నయ్.. జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయి గోసవడ్తం. దగాపడ్డ తెలంగాణను కాపాడి.. తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన” అని చెప్పారు.  మినీ ఇండియాగా పిలుచుకునే పటాన్ చెరుకు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.