పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, కొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ తప్పుబట్టింది. వీటికి సంబంధించి ఏపీ జారీ చేసిన జీవో 203 విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై కోర్ కమిటీ మండిపడింది. పోతిరెడ్డిపాడు, రాష్ట్రంలో వ్వయసాయం విధానంపై రైతుల ఆందోళన వంటి అంశాలపై గురువారం బీజేపీ కోర్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా జారీ చేసి జీవో పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న TRS ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ఉదయం 10 నుంచి 11 మధ్య రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేస్తాయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ రైతు బంధు కావాలంటే తాను చెప్పిన పంటలే వేయాలని, లేకుంటే ఈ పథకం వర్తించదని సీఎం కేసీఆర్ అనడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. రైతు బంధును ఎగ్గొట్టడానికే సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనల ద్వారా సీఎం రైతులకు శత్రువుగా మారుతున్నారని అన్నారు.
చిరు వ్యాపారులకు మోడీ పెద్ద కానుక
ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ ద్వారా చిరు వ్యాపారులకు ప్రధాని మోడీ పెద్ద కానుక అందించారని అన్నారు బండి సంజయ్. రైతులకు, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు, మధ్య తరగతి ప్రజలకు భరోసా నింపే విధంగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన మోదీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ ప్యాకేజీ రుజువు చేస్తోందన్నారు.
