సిటీ జనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న JBS … MGBS మార్గంలో మెట్రో పరుగులు మొదలయ్యాయి. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ ఈ కొత్త రూట్ ను ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు
JBS నుంచి MGBS మెట్రో రూట్ మొత్తం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 9 స్టేషన్లున్నాయి. సికింద్రాబాద్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్ ఏరియాల్లో ప్రయాణించే వారికి ఈ రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా జిల్లాల నుంచి JBSకు వచ్చే వారికి కూడా MGBS రూట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా JBS నుంచి MGBS కు రోడ్డు మార్గంలో వెళ్లడానికి 45 నిమిషాల వరకు టైం పడుతుంది. అదే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే గంటకు పైగానే పడుతుంది. మెట్రోలో మాత్రం కేవలం 16 నిమిషాల్లో JBS నుంచి MGBS కు వెళ్లొచ్చు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ ను 2012లో 15వేల కోట్ల రూపాయలతో ప్రారంభించారు. మొత్తం 72కిలోమీటర్లుగా మూడు కారిడార్లను డిజైన్ చేశారు. మొదటి కారిడార్ మియాపూర్ టూ ఎల్బీనగర్, మూడో కారిడార్ నాగోల్ టూ రాయదుర్గం ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రెండో కారిడార్ జేబీఎస్ టూ MGBS కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ రెండో కారిడార్ ని మొదట జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్లు నిర్మించాలని డిజైన్ చేశారు. కానీ పాతబస్తీ పనులపై మొదటి నుంచీ అడ్డంకులు వచ్చాయి. దాంతో 72 కిలోమీటర్లలో ఓల్డ్ సిటీని మినహాయించడంతో ఫస్ట్ ఫేజ్ 67 కిలోమీటర్లకు తగ్గింది.
హైదరాబాద్ మెట్రోకు ఇప్పటికే రోజురోజుకు రష్ పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రతి రోజూ 3లక్షల 70వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. కొత్త రూట్ ప్రారంభంతో .. ఇది నాలుగున్నర లక్షలకు చేరుకునే అవకాశముంది.
