
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదివారం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట భార్య శోభ కూడా ఉన్నారు. కేసీఆర్ దంపతులు ఒక విమానంలో వెళ్లగా.. మరో విమానంలో వాళ్ల బిడ్డ, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ మూడ్రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో పంటి నొప్పికి ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయన.. మరోసారి డాక్టర్లను కలవనున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల శోభ కూడా ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలు చేయించుకున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వడ్ల కొనుగోళ్లు, ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ స్టూడెంట్లకు సంబంధించి ప్రధానికి సీఎం లెటర్లు రాశారు. ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికితే ప్రత్యేకంగా కలిసి వివరించనున్నట్లు సమాచారం. అదే విధంగా వడ్ల కొనుగోళ్లపై ఢిల్లీ కేంద్రంగా ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. వడ్ల కొనుగోళ్లపై సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా 11న ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంపై కేసీఆర్ పలువురితో చర్చలు జరపనున్నట్లు సమాచారం.