
ఢిల్లీతో తాడో పేడో తెల్చుకుంటానన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో నాలుగు రోజులూ ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఈరోజు వరకు ఢిల్లిలోని తన నివాసమైన 23 తుగ్లక్ రోడ్ లోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన కేసీఆర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్న కేసీఆర్ ఎవరినీ కలవలేదు. నిన్న (మంగళశారం) కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి తోమర్ తో కేవలం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. కేసీఆర్ కేంద్ర మంత్రితో సమావేశం కాలేదు. ఇవాళ సాయంత్రం వరకు కూడా కేసీఆర్ మోడీని కలిసే ఛాన్స్ లేదు. సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీని కలవనున్నారు. నిన్న మోడీ అపాయింట్ మెంట్ కోరడంతో పీఎంవో ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చింది. కానీ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వరు.? అసలు కేసీఆర్ మోడీ అపాయింట్ మెంట్ అడగలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ఆరోగ్యం బాగాలేక ఢిల్లిలోని ఎయిమ్స్ లో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు తప్ప.. రాష్ట్ర సమస్యలపై కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.