మేం చెప్పిందే చెయ్యాలె సొంత ప్రయారిటీలొద్దు.. జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్

మేం చెప్పిందే చెయ్యాలె సొంత ప్రయారిటీలొద్దు.. జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్

సొంత ప్రయారిటీలొద్దు.. బాధ్యతగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్

ప్రభుత్వ ప్లాన్ ను పక్కాగా అమలు చేయండి

పథకాలన్నీ ఒకే తీరుగా అమలు కావాలి

గ్రామాలు, పట్టణాల్లో మార్పులు తేవాలి

సర్పంచులు, కార్యదర్శులకు బాధ్యతలపై అవగాహన కల్పించండి

అనుకున్నట్టుగా జరగకపోతే చర్యలు తప్పవు

 మొక్కలు నాటాలి.. అడవులు పెంచాలి

అత్యవసర పనుల కోసం కలెక్టర్లకు రూ.కోటి

వార్డుకో యూనిట్​గా పట్టణ ప్రగతి ప్రోగ్రాం

మున్సిపల్​ ఖాళీల వివరాలివ్వండి.. వెంటనే భర్తీ చేస్తం

సొంత ప్రయారిటీలు, ఎజెండాలు పక్కనపెట్టి పూర్తిగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై మాత్రమే పనిచేయాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగమంతా ఒక టీమ్​గా పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో మార్పులు తెచ్చే బాధ్యత కలెక్టర్లదేనని, అందుకే వారికి అనేక అధికారాలు కట్టబెట్టామని చెప్పారు. అనుకున్నట్టుగా మార్పులు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ప్రగతిభవన్​లో కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్​ దిశా నిర్దేశం చేశారు. పబ్లిక్​ టాయిలెట్ల నుంచి పాలసీ డెసిషన్లదాకా చాలా అంశాలపై సూచనలు చేశారు. స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడంపై దృష్టిపెట్టాలన్నారు.

గ్రామాల్లో మార్పు బాధ్యత కలెక్టర్లదే..

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపం మార్చే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘డ్యూటీ పట్ల నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చినం.

ప్రభుత్వం తన పవర్స్​ను వదులుకుని కలెక్టర్లకు ఇచ్చింది. సర్కారు చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా మార్పు రాకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి పని వారితో చేయించే బాధ్యత కలెక్టర్లదే” అని పేర్కొన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు కలెక్టర్ల దృష్టికి వచ్చిన అత్యవసర, ప్రాముఖ్యత కలిగిన పనులను వెంటనే చేయించుకోవడానికి వారికి కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

పథకాలు ఒకే తీరుగా అమలు కావాలె

ప్రభుత్వం రూపొందించే చట్టాలు, కార్యక్రమాలు, పథకాలు అమలు చేసే విషయంలో కలెక్టర్లదే కీలక ప్రాధాన్యత అని సీఎం కేసీఆర్  చెప్పారు. ‘‘ప్రభుత్వం రూపొందించిన పథకాలను కలెక్టర్లు అమలు చేయాలి. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొద్దు. అందరూ ఒక టీంగా పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి కింది వరకు ఒకే తీరుగా ఉండాలి. ఒకే ప్రాధాన్యతతో పనులు చేయాలి’’ అని వివరించారు. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, కంటి వెలుగు వంటి పథకాలతో పేదల కష్టాలు దూరమవుతాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్లకు సపోర్టుగా ఉండేందుకు అడిషనల్ కలెక్టర్లను నియమించామని, వారిలో ఒకరు పూర్తిగా స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. గతంలో 112 కమిటీల్లో కలెక్టర్లు చైర్మన్లుగా ఉండేవారని, ఇప్పడు వాటిని 26 విభాగాలుగా మార్చడంతో పని ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.

భూరికార్డులను సరిదిద్దాలి

అస్తవ్యస్తంగా ఉన్న భూరికార్డులను సరిదిద్దే బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం కేసీఆర్  చెప్పారు. జిల్లాల్లో భూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలో ఉంటుందని, రికార్డులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 95 శాతం భూములు సవ్యంగా ఉన్నాయని, వివాదాలున్న మిగతా ఐదు శాతం భూములను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కొత్తగా తెచ్చిన పంచాయతీ, మున్సిపల్ చట్టాల ద్వారా జిల్లాలో కలెక్టర్ బాధ్యత మరింత పెరిగిందన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను పరిష్కరిస్తామని
చెప్పారు.

పట్టణ ప్రగతిలో వార్డుకో యూనిట్

పల్లె ప్రగతి కార్యక్రమం తరహాలో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడతామని సీఎం తెలిపారు. అందులో వార్డును యూనిట్ గా తీసుకోవాలని, ఆ వార్డుల్లో ఉండే ప్రజాప్రతినిధులు, స్థానికులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల ఖాళీల వివరాలను అందిస్తే వాటిని వెంటనే భర్తీ చేస్తామని సూచించారు. హైదరాబాద్  నగరానికి ప్రతి నెలా రూ.78 కోట్లు, మిగతా నగరాలు, పట్టణాలకు కలిపి రూ.70 కోట్లు ఇస్తామని తెలిపారు. వాటితోపాటు స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ది పై దృష్టి సారించాలని చెప్పారు.

మొక్కల సంరక్షణ బాధ్యత మంత్రులు, కలెక్టర్లదే

మొక్కలు నాటడం, సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యతేనని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. వారి పనితీరుకు ఇదే గీటురాయిగా ఉంటుందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాటిన మొక్కల్లో 85 శాతం కచ్చితంగా బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా అడవుల శాతం తక్కువగా ఉన్న హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలప స్మగ్లింగ్ చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘‘మొక్కలు నాటడమే కాదు. అడవుల్లో కలప స్మగ్లింగ్ ను ఆపాలి. కలెక్టర్లు కఠినంగా ఉండాలి. అటవీ భూముల్లో దట్టంగా చెట్లు పెంచాలి. పదెకరాల అటవీ భూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం..” అని సీఎం పేర్కొన్నారు.

త్వరలో పంచాయతీరాజ్ సమ్మేళనం

సర్పంచులు, కార్యదర్శులు ఏమేం చేయాలో వారికి అవగాహన కల్పించేందుకు 15 రోజుల్లో జిల్లా కేంద్రాల్లో పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘‘పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించండి. సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలను పిలవండి. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లను పిలిచి అవగాహన కల్పించండి” అని వివరించారు. ఆ సమావేశం తర్వాత గ్రామాల్లో రూపురేఖలు మార్చేందుకు పది రోజుల గడవు ఇవ్వాలన్నారు. పల్లె ప్రగతి స్పెషల్ డ్రైవ్ కాదని, నిరంతరం కొనసాగే కార్యక్రమమని చెప్పారు. ప్రతి గ్రామం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని, కలెక్టర్లు ఆ దిశగా కృషి చేయాలని కోరారు.

ఢిల్లీ మాదిరి హైదరాబాద్  కావొద్దు

హైదరాబాద్ నగరం కాలుష్య కాసారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్  చెప్పారు. నిర్లక్ష్యం చేయకుండా ఇప్పట్నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘నగరం లోపల, చుట్టూ లక్షా 60 వేల ఎకరాల అడవి ఉంది. వాటిని కేబీఆర్ పార్క్, హరిణ వనస్థలి మాదిరి తయారుచేయాలి. కాలుష్యం నివారణకు ప్రణాళిక ఉండాలి’’ అని చెప్పారు. డిజిల్ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను ఎంకరేజ్ చేయాలన్నారు.

పాలసీలపై స్టడీ కోసం విదేశాలకు కలెక్టర్లు

వివిధ దేశాల్లో అమలవుతున్న పాలనా విధానాలను అధ్యయనం చేసేందుకు కలెక్టర్లను విదేశాలకు పంపుతామని సీఎం చెప్పారు. మంచి పాలసీలను అమలు చేయడానికి ఆ టూర్లు ఉపయోగపడతాయన్నారు. యువ ఐఏఎస్ లు భవిష్యత్ లో వివిధ శాఖాధిపతులుగా పనిచేయాల్సి ఉంటుందని.. అందువల్ల దీర్ఘకాలిక వ్యూహాలు, మంచి ఆలోచనలు, విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.

కలెక్టర్లకు వైర్ లెస్ సెట్లు

జిల్లా కేంద్రంలోని ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు కలెక్టర్లకు వైర్ లెస్ సెట్లు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. కొత్తగా నియమించిన స్థానిక సంస్థల బాధ్యతలు చూసే అడిషనల్ కలెక్టర్లు ప్రతి గ్రామ, పట్టణ చరిత్రతోపాటు సంపూర్ణ వివరాలను వారి కంప్యూటర్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతినెలా చెల్లించే జీతభత్యాలు, ఆదాయం, అప్పులు, కరెంట్ బిల్లుల వంటి వివరాలను తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు.  గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉండే అధికారులతో అడిషనల్ కలెక్టర్లు నిత్యం సంప్రదింపులు జరపాలని చెప్పారు. ఇందుకు వీలుగా గ్రామ, పట్టణాభివృద్ధిపై అడిషనల్ కలెక్టర్ల(లోకల్ బాడీస్) కు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.

సీఎం ఆదేశాల్లో కొన్ని పాయింట్స్

కలెక్టర్లు మున్సిపాలిటీల్లో ఉద్యోగుల ఖాళీల వివరాలను అందిస్తే వాటిని వెంటనే భర్తీ చేస్తం.

మున్సిపాలిటీల్లో రోడ్లు, వీధుల వెంట ఉండే చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా తరలించొద్దు.

కలెక్టర్లు పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. అవసరమైతే స్వయంగా జిల్లాల్లో పర్యటించి పోడు సమస్యకు చరమగీతం పాడుతా.

అన్ని పట్టణాల్లో కచ్చితంగా వెజ్/ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి.

మెదడువాపుతోపాటు ఇతర వ్యాధులకు కారణమవుతున్న పందుల నివారణకు వ్యూహత్మకంగా వ్యవహరించండి. పందులను పెంచుతూ జీవించేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపండి.

గుట్టలు, కొండల మీద గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నవారికి పట్టాలివ్వండి.

ఇండ్లపై వేలాడే కరెంట్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామానికో నర్సరీ పెట్టినట్లే పట్టణాల్లోనూ నర్సరీలు ఏర్పాటు చేయాలి.

ఊర్లలో సర్ ప్రైజ్ విజిట్ చేస్త..

పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ఏ మేర మార్పు చెందాయో తెలుసుకునేందుకు తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం కేసీఆర్  చెప్పారు. ‘‘పల్లె ప్రగతిపై ఫ్లయింగ్  స్క్వాడ్స్‌‌ తనిఖీలు చేస్తయి. నేను కూడా ఆకస్మిక తనిఖీ చేస్తా. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు.

అన్ని పట్టణాల్లో  పబ్లిక్ టాయిలెట్లు కట్టాలె..

గ్రామాల నుంచి వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే మహిళలు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని సీఎం అన్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం రోడ్డుకు దగ్గరగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించుకోవాలని సూచించారు. ముందుగా కలెక్టరేట్లలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని చెప్పారు.