
మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ లో మీటింగ్
పోతిరెడ్డిపాడు విస్తరణపై మాట్లాడుకునే అవకాశం
రెండు రాష్ట్రాల అంశాలు, ఎన్ ఆర్సీ పై చర్చ
హైదరాబాద్ , వెలుగు : తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ప్రగతిభవన్లో మధ్యాహ్నం12 గంటలకు సమావేశం కానున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న వివిధ అంశాలతో పాటు ఎన్నార్సీపైనా చర్చించే అవకాశం ఉంది. గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ కు తరలించడానికి ఉమ్మడి ప్రాజెక్టు చేయాలనే విషయాన్ని గతంలో చర్చించారు. తర్వాత ఏపీ సొంతంగానే చేపట్టాలనే నిర్ణయం తీసుకుంది. అది కూడా ముందుకు పడకపోవడంతో మళ్లీ ఉమ్మడి ప్రాజెక్టు అంశం తెరమీదకు వచ్చే చాన్స్ఉంది.
పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసు కోగా, తెలంగాణలో రాజకీయ విమర్శలు వచ్చాయి. దీనిపైనా ఇద్దరు సీఎంలు చర్చించనున్నట్టు తెలిసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కిరాగా, షెడ్యూల్ 9, 10 లోని సంస్థల విభజన ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆప్మెల్ ను ఏపీ ప్రభుత్వరంగ సంస్థగా ప్రకటించడంపై తెలంగాణ అభ్యంతరం చెప్పింది. ఫైనాన్స్ కమిషన్ బైఫరికేషన్ , కేంద్రంతో సంబంధాలు సహా పలు అంశాలపై మాట్లాడుకోనున్నారు.