రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కట్టడికి సీఎం కేసీఆర్ సమీక్ష జరపడం లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వైద్య శాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయన్న భయంతోనే సమీక్ష నిర్వహించడం లేదన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అన్నారు. లక్ష 82 వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో… వైద్యం గురించి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్ కిట్స్ లేవని అన్నారు. మానవత్వం లేని పాలకుల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. వైద్య శాఖకు వెంటనే నిధులు విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న మంత్రి ఈటలకు… కరోనా ట్రీట్‌మెంట్ పేరుతో ప్రయివేటు ఆస్పత్రులు చేస్తున్న దోపిడీ కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు.
ప్రయివేటు ఆస్పత్రుల్లో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు భట్టి విక్రమార్క. ట్రీట్‌మెంట్ విషయంలో ప్రయివేటు ఆస్పత్రుల్లో రేట్లు ఫిక్స్ చెయ్యాలన్నారు. 17 మంది అధికారులను… 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా నియమించి ప్రజల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

