ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

ఈ నెల 18న  ఖమ్మం పరిధిలోనే 5 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించారు. ఈ సభకు నాలుగు రాష్ట్రాల నుంచి సీఎం లను ఆహ్వనిస్తున్నామని చెప్పారు. సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. 

టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఖమ్మంలో ఈ నెల 18 వ తేదీన భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సమావేశమైన ఖమ్మం జిల్లా నేతలు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు  సంబంధించి చర్చించారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో  మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్, బండి పార్థ సారథి రెడ్డి, రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్,  ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, తదితర నేతలు హాజరయ్యారు.

ప్రగతిభవన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపైచర్చించారు.  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామానాగేశ్వర్‌రావు తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి  హాజరయ్యారు. ప్రధానంగా ఈ నెల 18న నిర్వహించే భారీ బహిరంగ సభ, జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీకి కొత్తగూడెం, పాలెరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, కందా ఉపేందర్ డుమ్మా కొట్టారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడతారన్న చర్చ నడుస్తోన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

గతకొంతకాలంగా పార్టీపై తుమ్మల,పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొంగులేటి గత కొన్నిరోజులుగా చేస్తున్న కామెంట్స్ చూస్తే ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది. అటు తుమ్మల కూడా తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే  ప్రకటించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సిట్టి్ంగ్ లకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో తుమ్మల కూడా పార్టీ మారుతారన్న  ప్రచారం జోరందుకుంది. వారిద్దరూ బీజేపీలో చేరనున్నారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రం ఎలా మారనుందన్న అంశంపై క్లారిటీ రావాలంటే ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ వరకు వేచి చూడాల్సిందే.