ఎదుటి వాడిని ప్రేమించడమే మతం

ఎదుటి వాడిని ప్రేమించడమే మతం

ఏ మతంలో కూడా మనుషులను ద్వేషించమని చెప్పరని సీఎం కేసీఆర్ అన్నారు. ఎదుటివాడిని ప్రేమించడమే మతమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు హాజరయ్యారు.

‘చాలా మంది శాస్త్రవేత్తలు తమ జీవితాలను త్యాగం చేసి పెన్సిలిన్ లాంటి మందులను కనుగొన్నారు. వాటి వల్లే మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఏ మతంలో కూడా మనుషులను ద్వేషించమని చెప్పరు. కొంత మంది ముస్లిం రాజులు గుళ్లు కూలగొట్టారు. దాని వల్ల హిందువులు బాధపడ్డారు. ఇలా చేయడం వల్ల ముస్లింలు ఏం సాధించారు. ఇతర మతాలను రెచ్చగొట్టడం తప్ప సాధించింది ఏం ఉంది. మతం ఉన్మాద స్థితికి వెళ్తేనే తప్పులు జరుగుతాయి. అది ఏ మతమైనా కావచ్చు. ఎదుటి వాడిని ప్రేమించమడమే మతం. భారత్ లో అన్ని పండుగలు చాలా గొప్పగా జరుగుతాయి. అర్థం చేసుకొని ఆస్వాదించగలిగితే ఇండియా బెస్ట్ కంట్రీ. మనుషులు చాలా సహజంగా జీవించాలి. క్రిస్మస్, బతుకమ్మ, బోనాల పండుగలను చేయమని నన్ను ఎవరు అడగలేదు. కానీ, నేను ఇక్కడి పరిస్థితులను గమనించి ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నాం. అన్ని పండుగలు చేయడం కొందరికి నచ్చకపోవచ్చు, కానీ జరుపుతాం. ఒకరు మీద ఒకరు  దాడులు చేసుకోకుండా చూడవలసిన  బాధ్యత మనది. ఎవరి మీద దాడులు జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కఠినంగా శిక్షిస్తాం. క్రిస్టియన్లకు ఉన్న సమస్యలను గుర్తించి.. వచ్చే కేబినెట్ లో చర్చించి  పరిష్కారం చేస్తాం. కరోనా మహమ్మారి నుంచి బయటపడి అన్ని పండుగలను అందరూ కలిసి చేసుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని సీఎం కేసీఆర్ అన్నారు.