టీఆర్​ఎస్​ లీడర్లు సామాన్యులను టార్చర్​ పెడ్తున్నరు

టీఆర్​ఎస్​ లీడర్లు సామాన్యులను టార్చర్​ పెడ్తున్నరు
  • ఆర్డీఎస్​ దగ్గర కుర్చీ వేసుకొని పనులు చేయిస్తానన్నడు.. ఏమాయె?
  • బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఫైర్​ఇక నుంచి ఆర్డీఎస్​ బాధ్యత కేంద్రానిదే
  • ఆరు నెలల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తం
  • కేంద్రం ఇచ్చే నిధులపై కేటీఆర్​ తెలుసుకొని మాట్లాడాలె
  • సాయి గణేశ్​ ఆత్మహత్యకు కారణమైన మంత్రిని వదిలిపెట్టబోమని హెచ్చరిక

మహబూబ్​నగర్/గద్వాల​, వెలుగు:  ‘‘కేసీఆర్​.. నీ చేతగానితనంతో నడిగడ్డ ప్రజలు గోసపడ్డరు. ఆర్డీఎస్​ దగ్గర కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేయిస్తా అన్నవు. ఎనిమిదేండ్లయినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇయ్యలె. నువ్వు దద్దమ్మవు” అని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక తేరు మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్​ మాట్లాడారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక ఆర్డీఎస్​ గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రాల రైతులు రెండు పంటలు వేస్తే, ఇక్కడి రైతులు ఒకే పంట వేసుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ‘‘డీకే అరుణ ఆర్డీఎస్​ సమస్య గురించి చెప్పారు. అందుకే పాదయాత్రకు ముందే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​కు ఫోన్​ చేసి, ఈ సమస్య గురించి చెప్పిన. ఇప్పుడు కేంద్రం స్పందించింది. ఆర్డీఎస్​ ద్వారా నడిగడ్డ ప్రాంతానికి 80 వేల ఎకరాలకు సాగునీటిని అందించే బాధ్యతను కేంద్రమే తీసుకుంది..”అని తెలిపారు. కేఆర్​ఎంబీసీ ఆధ్వర్యంలోనే ఆర్డీఎస్​ హెడ్​ రెగ్యులేటరీ వద్ద మార్పులు, మెయిన్​ కెనాల్​కు రిపేర్లు, తెలంగాణ వైపు మెయిన్ కెనాల్​ ఉన్న ఏరియాలో టెలిమెట్రీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నడిగడ్డ ప్రాంతానికి కేసీఆర్​ మోసం చేస్తున్నారని, నెట్టెంపాడు స్కీంకు రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ ఫాంహౌస్​లోకి నీళ్లు తెచ్చుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టి, కమీషన్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు.  నడిగడ్డలో మెడికల్​ కాలేజీ లేదని, పిల్లలు చదువుకోవడానికి బడులు కూడా సక్కగా లేవన్నారు. 300 బెడ్స్​తో హాస్పిటల్​ కట్టిస్తానని చెప్పి కేసీఆర్​ మాట తప్పారని ఆయన దుయ్యబట్టారు. 

కేటీఆర్.. అన్నీ తెలుసుకొని మాట్లాడాలె

‘‘ఓ మంత్రి కేంద్రం నిధులు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నడు. అన్నీ తెలుసుకొని మట్లాడాలి. కేంద్రం నుంచి తెలంగాణకు పన్నుల వాటా కింద రూ.1.68 లక్షలు కోట్లు, కేంద్ర స్కీంల కోసం రూ.1.58 లక్షల కోట్లు ఇస్తుందనే విషయం తెలియదా?” అని మంత్రి కేటీఆర్​ను  సంజయ్​ ప్రశ్నించారు. రైతు వేదికలకు రూ.10 కోట్లు, ఒక్కో నర్సరీ ఏర్పాటుకు రూ.1.16 లక్షలు, పల్లె ప్రకృతి వనాలు అన్నింటికి కేంద్రం నిధులే వాడుతున్నారనే విషయం గుర్తించుకోవాలన్నారు. ‘‘నేషనల్​ హైవేలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మరుగుదొడ్లు, పేదలకు గ్యాస్​ కనెక్షన్లు, గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నయో చెప్పాలి. ప్రధాని వల్లే తలెత్తుకు తిరుగుతున్నామని మీ సర్పంచులే చెప్తున్నరు” అని సంజయ్ చెప్పారు. 

సాయి గణేశ్​ త్యాగం వృథా కానివ్వం

‘‘ఖమ్మంకు చెందిన సాయి గణేశ్​ కాషాయ జెండా కోసం ఫైట్​చేస్తే 16 కేసులు పెట్టిన్రు. ఈ రోజు మా మధ్య లేకపోవడం బాధేస్తున్నది’’ అని బండి సంజయ్​ అన్నారు. సాయి గణేశ్​ త్యాగ్యాన్ని వృథా కానివ్వబోమని చెప్పారు. ఆయన ఆత్మహత్యకు కారకులైన మంత్రి చిట్టా తమ దగ్గరుందని, వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. టీఆర్​ఎస్​ లీడర్లు గూండాలుగా మారరని, వారి టార్చర్​తో సామాన్యులు సూసైడ్​లు చేసుకుంటున్నారని సంజయ్ చెప్పారు. దళితులను మోసగించేందుకే దళిత బంధు స్కీమ్ పెట్టారని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై కుప్పుస్వామి ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు మతి భ్రమించిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్  విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ నడిగడ్డ ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. 

రైతు రుణ మాఫీ ఏమైంది?

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ ఏమైందని బండి సంజయ్‌‌‌‌ ప్రశ్నించారు. రుణమాఫీ, కౌలు రైతుల రక్షణపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సంజయ్ గురువారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని కోరారు. 31 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని,  మొత్తంగా రాష్ట్రంలో ఉన్న 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్లు రుణమాఫీ ప్రభుత్వం చేయాల్సి ఉందన్నారు.