ఈటలను పొమ్మని.. రమణను రమ్మని

ఈటలను పొమ్మని.. రమణను రమ్మని

బీసీ లీడర్​ లోటును బీసీతోనే భర్తీ చేసుకునేందుకు టీఆర్​ఎస్​ ప్లాన్
ఎర్రబెల్లితో రాయబారం పంపిన కేసీఆర్​
ఆహ్వానించిన మాట నిజమేనన్న రమణ
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కరోనా కారణంగా వాటి ఎన్నిక ఆలస్యమవుతోంది. వీటికి తోడు గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ సీటు ఒకటి ఈ నెల 16న ఖాళీ కానుంది. ఈ సీటును వెంటనే భర్తీ చేసే అవకాశాలున్నాయి. అందుకే రమణకు గులాబీ బాస్​ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టు టీఆర్​ఎస్​ లీడర్లు  చెప్తున్నారు.

హైదరాబాద్​, వెలుగు: ఈటల రాజేందర్​ రాజీనామాతో ఖాళీ అయిన బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయాలని టీఆర్​ఎస్​ ప్లాన్​ చేస్తోంది. ఉద్యమం నుంచి పార్టీలో కీలకంగా ఉన్న ఈటలను సాగనంపటంతో బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే బీసీలను దూరం చేసుకోకుండా,  ఇప్పుడున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు పావులు కదుపుతోంది.

బీసీల్లో అత్యధిక ఓటు బ్యాంకున్న ముదిరాజ్  వర్గం నుంచి ఇంతకాలం టీఆర్​ఎస్​లో ఉన్న ఒకే ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇప్పుడు పార్టీని ఆయన వీడటంతో ఆ స్థాయిలో ముదిరాజ్​ లీడరెవరూ టీఆర్​ఎస్​లో లేకుండా పోయారు. సొంత పార్టీలో బీసీ లీడర్లు వేళ్లపై లెక్కించే సంఖ్యలోనే ఉండటంతో ఇతర పార్టీల్లోని లీడర్లకు టీఆర్​ఎస్​  గాలం వేస్తోంది. ఇందులో  భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో సంప్రదింపులు జరుపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్‌‌లో మంత్రిగా పనిచేసిన రమణ ఒక దఫా ఎంపీగా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన రమణకు బీసీ వర్గాల్లో  మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి కరీంనగర్  జిల్లాపై పట్టుంది.  హుజూరాబాద్​ నియోజకవర్గంలో పద్మశాలి ఓటు బ్యాంకు ఎక్కువుంది. దీంతో రమణను పార్టీలోకి చేర్చుకోవాలనేది టీఆర్​ఎస్​ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే  ఎమ్మెల్సీ పదవి ఆఫర్​ చేసి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ద్వారా కేసీఆర్​ రాయబారం పంపించారు. టీడీపీలో పని చేసిన పాత దోస్తీతో రమణను ఎర్రబెల్లి సంప్రదిస్తున్నారు.  రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే టీడీపీ కనుమరుగైంది. ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడారు. ఏడేండ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రమణ కూడా టీడీపీకి తెలంగాణలో మంచి రోజులు వచ్చేటట్లు లేవని యాక్టివ్​ పాలిటిక్స్​కు దూరంగా ఉంటున్నారు. అందుకే టీఆర్​ఎస్ లో చేరే అవకాశాలున్నాయని గులాబీ లీడర్లు ధీమాతో ఉన్నారు. 
ఇంకా తేల్చుకోలేదు: రమణ
టీఆర్ఎస్​లో చేరాలని తనను ఆహ్వానించిన మాట నిజమేనని రమణ మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. ఆ విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే 6 సార్లు టీఆర్​ఎస్​ లీడర్లు తనతో సంప్రదింపులు జరిపారని,  జూన్  1న తాను బెంగళూరులో ఉండగా ఎర్రబెల్లి ఫోన్ చేసి, సీఎం గుర్తుచేసిన విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. 3 రోజుల కిందట బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్​రావు కూడా బీజేపీలోకి రావాలని కోరారని తెలిపారు. తమ పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయానికి వస్తానన్నారు.