కరీంనగర్ కు కరువు పీడ పోయింది : సీఎం కేసీఆర్

కరీంనగర్ కు కరువు పీడ పోయింది : సీఎం కేసీఆర్

మిడ్ మానేరుతో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి శాశ్వతంగా కరువు పీడ తొలిగిపోయిందని తెలిపారు సీఎం కేసీఆర్. సోమవారం మిడ్ మానేరును సందర్శించిన కేసీఆర్ ప్రాజెక్టుకు గంగ పూజ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కాళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్ మానేరు నింపామని..SRSPతో సంబంధంలేకుండా రెండు పంటలు పండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. 46 వాగులున్న ఈ జిల్లా భయంకరమైన కరువు తాండవం చేసిందని.. రైతులు వలసలు పోయారని తెలిపారు. ఇప్పుడు ఈ జిల్లా మిడ్ మానేరుతో అద్భుతంగా రైతును ఆదుకుంటుందన్నారు. 9 నెలలు కాలువ పారుతుందని..160 కి.మీ. సంవత్సరం మొత్తం నిండే ఉంటుదని తెలిపారు. రాష్ట్రం మీద తమకు పూర్తి స్థాయిలో కమిట్ మెంట్ ఉందని.. ఇరిగేషన్ విషయంలో పూర్తి అవగాహన ఉందన్నారు కేసీఆర్.

చెక్ డ్యాంల కోసం కరీంనగర్ కు రూ.1252 కోట్లు ఇచ్చామని.. జూన్ లోపు జిల్లాలో ఉన్న చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామని చెప్పారు. కరువు కాటకాలతో తాండవం చేసిన పాత కరీంనగర్ జిల్లా.. ఈ జూన్ తర్వాత పాలుగారే జిల్లాగా కళకళలాడుతుందన్నారు. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే కూడా పంటలు అద్భుతంగా పండుతాయని.. ఇందుకోసమే చెక్ డ్యాంలు నిర్మిస్తామని చెప్పారు. కాళేశ్వరం పూర్తయితే కరీంనగర్ అద్భుతంగా తయారవుతుందని.. లండన్ లోని థేమ్స్ నదిలా మిడ్ మానేరు కనిపిస్తుందని చెప్పారు. పాపికొండలను తలదన్నేలా సిరిసిల్ల కొండలు ఉంటాయన్న ఆయన.. జిల్లాలోని 46 వాగులకు చెక్ డ్యాంల నిర్మాణం చేసి సత్ఫలితాలను చూపిస్తామన్నారు సీఎం కేసీఆర్.