హల్దీ కాల్వలోకి గోదావరి జలాలను విడుదలచేసిన కేసీఆర్

V6 Velugu Posted on Apr 06, 2021

సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వతో హల్దీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. వర్గల్ మండలం అవుసులపల్లి వాగులోకి గోదావరి జలాలను రిలీజ్ చేశారు.  ఈ సందర్భంగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేములు ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. తర్వాత మర్కుక్ మండలం పాలముపర్లిలో గోదారి జలాలను గజ్వేల్ కెనాల్లోకి వదిలారు. 

సంగారెడ్డి కెనాల్ నుంచి ఏర్పాటు చేసిన తూముతో 16 వందల క్యూసెక్కుల నీటిని వదిలారు సీఎం. అవుసులపల్లి దగ్గర క్రాస్ రెగ్యులేటర్ ను నిర్మించి అక్కడి నుంచి హల్దీ వాగులోకి నీటిని మళ్లించడం కోసం తూము ఏర్పాటు చేశారు. 10 మీటర్ల వెడల్పుతో లింకు కాలువను తవ్వారు. లింక్ కెనాల్ తో చౌదర్పల్లి బంధం చెరువు, వరంగల్ పెద్ద చెరువు, అంబర్ పేట ఖాన్ చెరువు నుంచి 6 కిలోమీటర్ల వరకు ప్రవహించి హల్ది వాగులోకి నీళ్లు చేరునున్నాయి. వర్గల్ మండలంలో ప్రారంభమైన హల్దీ వాగు నిజాంసాగర్ వరకు 96 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. హల్దీ వాగులోకి వచ్చే గోదావరి జలాలు 10 రోజుల్లో మంజీర నది నుంచి నిజాంసాగర్ లోకి చేరతాయి. ఈ రూట్లో  దాదాపు 32 చెక్ డ్యాంలు నిండనున్నాయి. ఒక్కో చెక్ డ్యామ్ లో 0.62 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. ఈ నీటి విడుదలతో 4 జిల్లాల పరిధిలో 14 వేల 268 ఎకరాల్లో వరి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది.

Tagged CM KCR, siddipet, Godavari Water

Latest Videos

Subscribe Now

More News