- కోర్టులో ఇదే వాదనను గట్టిగా వినిపించండి
- ఏజీ, రోడ్డు రవాణా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టం–2019కి అనుగుణంగానే ఆర్టీసీ రూట్లను ప్రైవేట్‌కు అప్పగిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుందని, ఇదే వాదనను వచ్చే సోమవారం హైకోర్టులో బలంగా వినిపించాలని అడ్వొకేట్ జనరల్, రోడ్డు రవాణా శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఆర్టీసీ సమ్మెపై సీఎస్ ఎస్కే జోషి, రోడ్ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావుతో సీఎం కేసీఆర్గురువారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. హైకోర్టులో వాదనలపైనా ఆయన ఆరా తీశారు. 5,100 రూట్లను ప్రైవేట్‌కు అప్పగిస్తూ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే అధికారం ఎవరికీ లేదని, ఈ విషయంలో కోర్టుల జోక్యం కూడా ఉండొద్దని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే తీసుకున్నామని, ఇదే విషయాన్ని సోమవారం మరింత సమర్థవంతంగా కోర్టులో వినిపించాలని సూచించినట్లు సమాచారం. విలీనం డిమాండ్‌ను ఆర్టీసీ జేఏసీ వెనక్కి తీసుకున్న విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినా సీఎం స్పందించలేదని తెలిసింది.

