కేసీఆర్ స్పీచ్ : పక్కన కూర్చోలేకపోతున్న ముఖ్యమంత్రులు..!

కేసీఆర్ స్పీచ్ : పక్కన కూర్చోలేకపోతున్న ముఖ్యమంత్రులు..!

ఓ రాష్ట్ర సీఎం మాట్లాడుతుంటే పక్కనున్నవారు ఆసక్తిగా వింటారు. పక్కన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే ఇంకా ఆసక్తిగా గమనిస్తారు. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం దీనికి రివర్స్ జరుగుతోంది. ఆయన మాట్లాడుతుంటే పక్కనున్న సీఎంలు లేచి వెళ్లిపోతున్నారు. కేసీఆర్ కూర్చోమని రిక్వెస్ట్ చేస్తే తప్ప కూర్చోవడం లేదు. ఒక్కచోట కాదు రెండు రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. 

మార్చి 4న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. అయితే మీడియా సమావేశంలో  కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుండగా... హేమంత్ సోరెన్ మధ్యలోనే లేచి నిల్చున్నాడు. కేసీఆర్ కలుగజేసుకుని హేమంత్ సోరెన్ ను కూర్చొమ్మని చెబితే కూర్చున్నాడు. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. 

బుధవారం నితీశ్ కుమార్ తో భేటీ సందర్భంగా కూడా కేసీఆర్కు అదే సీన్ రిపీట్ అయ్యింది. నితీశ్, కేసీఆర్ ఉమ్మడి మీడియా సమావేశంలో జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మీడియా  కేసీఆర్కు పలు ప్రశ్నలు సంధించింది. కూటమి, పొత్తుల అంశాలను పదే పదే ప్రస్తావించింది. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ఉండడానికి ఒప్పుకుంటారా ? లేక ఎవరుంటారని అక్కడి రిపోర్టర్లు ప్రశ్నించారు.  దీనికి పలు పార్టీలతో భేటీయై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఒక దశలో నితీష్ కు సంబంధించి ప్రస్తావన రాగా.. ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. వెంటనే లేచి నిలబడి  మీడియా సమావేశం అయిపోయిందని అన్నారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూర్చొనే ఉన్నారు. మీరు కూర్చొండి.. అంటూ నితీష్ ను అభ్యర్థించారు. అయినా  కొద్దిసేపు ఆయన అలాగే నిలబడ్డారు. ఇలా రెండు, మూడుసార్లు జరిగింది. చివరకు రాజకీయాలు మాట్లాడనంటూ సీఎం కేసీఆర్ చెప్పడంతో సీఎం నితీష్ కూర్చొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు ఘటనలు కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో మైలేజ్ను తేకపోగా.. డ్యామేజ్ను తెచ్చిపెట్టాయనే విమర్శలు వస్తున్నాయి.