ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్: వాళ్ల‌ను బాగా చూసుకుంటాం.. పంపించండి

ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్: వాళ్ల‌ను బాగా చూసుకుంటాం.. పంపించండి

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. హైద‌రాబాద్, దానికి అనుకున్న ఉన్న జిల్లాల్లో మాత్ర‌మే కొత్త కేసులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. అక్క‌డ కూడా త్వ‌ర‌లోనే వైర‌స్ వ్యాప్తి కంట్రోల్ అవుతుంద‌న్నారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బుధ‌వారం నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను సీఎం కేసీఆర్ వివ‌రించారు. ప్రస్తుతం క‌రోనా అదుపులోనే ఉంద‌ని, మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతోంద‌ని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరుతో కరోనాపై విజ‌యం సాధిస్తామ‌న్న విశ్వాసం ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయ‌ని, ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. కొద్ది రోజుల్లోనే వైర‌స్ వ్యాప్తి కంట్రోల్‌లోకి వ‌స్తుంద‌ని, మళ్లీ మామూలుగా జీవించే రోజులు వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

మీ కూలీల‌ను బాగా చూసుకుంటాం

వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వేర్వేరు ప్రాంతాల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలన్నారు. బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా స్పందించారు. ‘‘నితీశ్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్ కూడా మీ బీహార్ వారే. దయచేసి పంపించండి’’ అని కేసీఆర్ అన్నారు.