హైదరాబాద్ లో 15 రోజుల పాటు లాక్ డౌన్ ?

హైదరాబాద్ లో 15 రోజుల పాటు లాక్ డౌన్ ?

GHMC ప‌రిధిలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పెట్ఏ ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజమ‌ని చెప్పారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగిందని, దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నద‌న్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించార‌ని గుర్తు చేసిన సీఎం… దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్పారు. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని , ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. కేబినెట్ ను సమావేశ పరచి, అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, జిహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.