రేపటిలోగా విధుల్లోకి చేరకుంటే మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు: సీఎం

రేపటిలోగా విధుల్లోకి చేరకుంటే మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు: సీఎం

రేపు అర్థరాత్రిలోగా విధుల్లో చేరని కార్మికులను.. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరకుంటే.. కార్మికులే ఇబ్బంది పడతారని తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణతో క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి, రవాణా, జీహెచ్ఎంసీ,  అధికారులు హాజరయ్యారు. కోర్టు విచారణలో అనుసరించాల్సిన విషయంపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. కార్మికులు  ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉందన్నారు సీఎం.

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని.. అయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి.. కార్మికులకు మూడు రోజుల గడువు ఇచ్చిందన్నారు సీఎం. ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి.. అమలు విషయంలో కఠినంగానే ఉంటుందన్నారు. 5వ తేదీ అర్థరాత్రి గడువు ముగిసే సరికి చేరకుంటే ఆ వెంటనే రెండు, మూడ్రోజుల్లో మిగతా ఐదు వేల రూట్లకు పర్మిట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుందన్నారు.  ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారన్నారు సీఎం.

హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారన్నారు సీఎం కేసీఆర్. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు.. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదన్నారు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళుతుందన్నారు. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో నెలల తరబడి, ఒక్కోసారి సంవత్సరాల తరబడి కేసుల విచారణ సాగుతుందన్నారు. దాంతో ఆర్టీసీ కార్మికులది అంతంలేని పోరాటం అవుతుందే తప్ప ఒరిగేదేమీ ఉండన్నారు సీఎం కేసీఆర్.

CM KCR review meeting on High Court hearing on the RTC strike in the camp office