14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ రివ్యూ 

14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ రివ్యూ 
  •     ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం 
  •     చీఫ్ గెస్ట్​గా ప్రకాశ్​ అంబేద్కర్​కు ఆహ్వానం 

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, కొత్త సెక్రటేరియట్ ప్రారంభం, ప్రభుత్వ పథకాల అమలుపై మంగళవారం ప్రగతిభవన్ లో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ తన దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపర్చినందువల్లే తెలంగాణ ఏర్పాటు సాకారం అయిందన్నారు. అంబేద్కర్ తెలంగాణ బాంధవుడు, అందరివాడు అని కొనియాడారు. విగ్రహావిష్కరణకు అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఒక్కరినే చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని ఆదేశించారు. అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించిన పద్మభూషణ్ రామ్ వంజీ సుతాన్ ను కూడా పిలిచి, సత్కరించాలని చెప్పారు.

విగ్రహం వద్ద నెల రోజుల పాటు టెంట్లు, తాగునీరు, మజ్జిగను సందర్శకులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది సభకు హాజరయ్యేలా చూడాలని, ఇందుకోసం 750 బస్సులను బుక్ చేసుకోవాలని చెప్పారు. అంబేద్కర్ ఔన్నత్యాన్ని చాటేలా దేశవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియాల్లో యాడ్స్​ఇవ్వాలన్నారు.

ఎన్టీఆర్​స్టేడియంలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు బహిరంగ సభకు ఏర్పాట్లు చెయ్యాలన్నారు. కాగా, కొత్త సెక్రటేరియట్ ను ఈ నెల 30న ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. సందర్శకులను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు అనుమతిస్తూ విజిటింగ్ హవర్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.