ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే దళితబంధు అందరికీ ఇస్తాం : సీఎం కేసీఆర్

ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే దళితబంధు అందరికీ ఇస్తాం : సీఎం కేసీఆర్

పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే అందరికీ దళితబంధు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. పాలేరులోప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. కేసీఆర్ వల్లే పాలేరుకు మోక్షం వచ్చిందన్న నేతలు..ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  నరం లేని నాలుకతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తుమ్మల  కాంట్రాక్టుల డబ్బు మదంతో  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తుమ్మలకు చాలా అవకాశాలు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. ఖమ్మంలో ఓడిపోయిన తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చానని చెప్పారు. తుమ్మల ద్రోహం చేశారా? బీఆర్ఎస్ ద్రోహం చేసిందో పాలేరు ప్రజలకు తెలుసన్నారు.  

 ఖమ్మం జిల్లాకు తుమ్మల ద్రోహం చేశారని ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్.  ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ కు ఆయన చేసింది గుండు సున్నా అని చెప్పారు.  ఎవరి చరిత్ర ఏంటో తెలుసుకుని పనిచేసిన వాళ్లకే ఓటు వేయాలని సూచించారు.  నీతి నిజాయితితో  ప్రజలకు కోసం  ఎవరు పనిచేశారో వారికే ఓటేయాలన్నారు. డబ్బుల కట్టలతో వచ్చే వారిని నమ్మితే ప్రజలు ఓడిపోతారని వ్యాఖ్యనించారు కేసీఆర్. పూటపూటకు పార్టీ మారే వారికి ఓటేస్తే వారు గెలుస్తారు కానీ.. ప్రజలు ఓడిపోతారన్నారు. తుమ్మల అడ్డగోలు మాటలను ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు. కందాల ఉపేందర్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారన్నారు.  ఆయనను తప్పకుండా గెలిపించుకోవాలని సూచించారు. 

పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు రాంరాం.. దళితబంధు జై భీం అని వ్యాఖ్యానించారు కేసీఆర్.  కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని అన్నారని..   రైతుబంధు ఉండల్నా ? రైతుబంధు దుబారానా?  ప్రజలే తేల్చుకోవాలన్నారు. తాను రైతును కాబట్టి రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. రైతుబంధు స్కీంను ఎంఎస్ స్వామినాథన్ మెచ్చుకున్నారని కేసీఆర్ చెప్పారు.  

ఆనాడు  రాదన్న తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నామన్నారు.   కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.  14 ఏళ్ల పోరాటం తర్వాత  ప్రత్యేక  తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్ తెలిపారు. తాను ఎన్నికల కోసం అడ్డమైన హామీలు ఇవ్వబోనన్నారు కేసీఆర్.