థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలె

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలె

హైద‌రాబాద్: ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు ఎంత ఖర్చుకైనా వెనకాడవద్దని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. థర్డ్ వేవ్ ఒక‌వేళ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వాక్సిన్, లాక్ డౌన్ అమలు పై సోమవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం..ప్ర‌జ‌ల ఆరోగ్యం కోస‌మే లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌న్నారు. రెండో డోసుకు స‌రిప‌డ టీకాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని అధికారుల‌కు చెప్పారు. బ్లాక్ ఫంగ‌స్ కు అవ‌స‌ర‌మైన మందులు ఉంచాల‌న్నారు సీఎం కేసీఆర్.

బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కోసం గాంధీ హాస్పిట‌ల్ లో 150 బెడ్లు, ఈ.ఎన్.టిలో 250 బెడ్లను, మొత్తం 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. సరోజినీదేవి హాస్పిట‌ల్ లో 200 బెడ్లు, గాంధీలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కోసం వెంట‌నే ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500కు పెంచాలని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్ ట్రీట్ మెంట్ కు మందులను తక్షణమే ఆర్డరివ్వాలన్నారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను అర్జెంటుగా నియమించుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్.