19 తర్వాత నేను రంగంలోకి దిగుత

19 తర్వాత నేను రంగంలోకి దిగుత
  •     పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అధికారుల పనితీరు ఎట్లుందో పరిశీలిస్త
  •     అడిషనల్​ కలెక్టర్లు అనుకున్న రీతిలో పనిచేస్తలేరు
  •     కరోనా తగ్గుముఖం పట్టిందన్న కేసీఆర్​
  •     పల్లె, పట్టణ ప్రగతిపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19  తర్వాత తాను ఆకస్మిక తనిఖీలు చేపడుతానని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ‘‘మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేండ్లు గడిచిపోయినయ్​. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు. క్షమించేదీలేదు. కఠిన చర్యలు తీసుకుంటం” అని  ఆయన హెచ్చరించారు. 

అదనపు కలెక్టర్ల నుంచి తాను చాలా ఆశించానని,  కానీ అనుకున్నంత స్థాయికి వారి పనితీరు చేరుకుంటలేదన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గిందని, పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గాక ఇంకో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతామని  చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీరుపై శుక్రవారం ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్​ రివ్యూ నిర్వహించారు. వానాకాలం ప్రారంభమైనందున ట్యాంకులను శుద్ధిచేసి తాగునీరును అందిచాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించేందుకు ఈ నెల 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల( డీపీవోల)తో ప్రగతి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తుగా ప్లాన్​ చేసుకోవాలన్నారు. 

ఇంకా లక్ష్యాలు మిగిలే ఉన్నయ్​

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని, ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు ఉన్నాయని సీఎం చెప్పారు. బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తాత్సారం జరిగినట్టు,  నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు పర్యటనలో గుర్తిస్తే క్షమించబోనని సీఎం హెచ్చరించారు. ఇప్పటివరకు గ్రామాలు, మున్సిపాలిటీలల్లో ఏమేమి పనులు జరిగాయో వేర్వేరుగా చార్టును రూపొందించాలని సీఎస్​ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు గ్రామాల్లో ఇక నుంచి సీజన్ వారీగా చార్ట్  తయారు చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, హెల్త్ డిపార్ట్ మెంట్ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. 

అక్రమ లే అవుట్లు అట్లనే ఉన్నయ్​

ఇక నుంచి మున్సిపల్ డైరెక్టర్​, పంచాయతీరాజ్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల తీరును పరిశీలించాలని సీఎం ఆదేశించారు. డీపీవోలను కూడా పల్లెల పర్యటనల్లో నిమగ్నం చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే అవుట్లు యథావిధిగా కొనసాగుతున్నట్టు తనకు సమాచారం ఉందని, వాటి గురించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని చెప్పామని, ఏ మేరకు అవుతున్నారని ఆయన ఆరా తీశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క శాతానికి పాజిటివిటీ రేటు చేరుకున్నదని సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో బెడ్లన్నీ ఎక్కువగా  ఖాళీగా ఉన్నాయన్నారు. కరోనా రోగులను పరామర్శించేందుకు సీఎం ఇటీవల చేపట్టిన గాంధీ , ఎంజీఎం దవాఖానల పర్యటన రాష్ట్రంలోని కరోనా బాధితులు, చికిత్స చేసే డాక్టర్లలో ఎంతో భరోసా నింపిందని సమావేశం అభిప్రాయపడింది.