
- కొత్త పోడు ఒప్పుకోం పాతవాళ్లకు కొన్ని హక్కులే ఉంటయ్: సీఎం
- పోడు భూములపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకపోత
- హరితహారానికి 6,556 కోట్లు ఖర్చు చేసినం
- గ్రీనరీలో ప్రపంచంలోనే థర్డ్ ప్లేస్‌లో మన రాష్ట్రం
- త్వరలోనే భూముల సర్వే అసైన్డ్ భూములు లాక్కోవడం మా విధానం కాదు
- అసెంబ్లీలో వెల్లడించిన కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: అటవీ భూముల్లో కొత్తగా పోడు సాగును ఒప్పుకోబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగు చేసుకుంటున్న వాళ్లకు స్వల్ప హక్కులు మాత్రమే ఉంటాయన్నారు. పోడు భూముల సమస్యపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని ఆయన ప్రకటించారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ 2005ను కటాఫ్‌గా పెట్టి పోడు భూములపై హక్కులు కల్పిస్తోందని, ఈ కటాఫ్ డేట్‌ను మార్చితేనే గిరిజనులకు హక్కులు కల్పించడం సాధ్యమవుతుందన్నారు. 2005 నాటికి పోడు చేసుకుంటున్న 96,676 మంది రైతులకు 3.85 లక్షల ఎకరాలకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చారని, ఆ తర్వాత ఇంకో ఆరు లక్షలకుపైగా ఎకరాల్లో పోడు చేసినట్టుగా మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో తేలిందని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ వివరాలు సభ ముందుంచి తీర్మానం చేస్తామన్నారు. హరితహారంపై శుక్రవారం అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్‌కు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఇకపై పోడు చేసుకునే వారికి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కటాఫ్ తేదీని కేంద్ర ప్రభుత్వం మార్చేలా చూడడానికి అన్ని పార్టీల ప్రతినిధి బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తానన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి వలస వచ్చే లంబాడీలు.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చే గొత్తికోయలతో స్థానిక గిరిజనుల, ఆదివాసీల హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. అలా వలస వచ్చినవాళ్లను గుర్తించి కట్టడి చేస్తామని చెప్పారు. అటవీ భూమి ఎప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కే చెందుతుందని, ‘ఫారెస్ట్ లైక్ కల్టివేషన్’తో ఆదివాసీలు, గిరిజనులకు కొన్ని హక్కులు మాత్రమే దక్కుతాయన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలున్న వారికి రైతుబంధు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అడవిమీద బతికే గిరిజనులపై కొందరు అత్యుత్సాహంతో దాడులు చేస్తున్నారని, ఆ పద్ధతి మానుకోవాలన్నారు.
హరితహారానికి రూ. 6,556 కోట్లు ఖర్చు చేసినం
హరితహారంలో ఇప్పటికి రూ. 6,556 కోట్లు ఖర్చు చేసి 200 కోట్ల మొక్కలను నాటామని సీఎం వెల్లడించారు. అడవుల్లో నాటిన 20.64 కోట్ల మొక్కలతో కొత్తగా 21.78 కోట్ల మొక్కలు పుట్టాయన్నారు. కంపా నిధులు కేంద్రం ఇచ్చేవి కావని, రాష్ట్రం వివిధ ప్రాజెక్టుల కింద సేకరించే అటవీ భూమికి పరిహారంగా కేంద్రం దగ్గర డిపాజిట్ చేసే మొత్తమని ఆయన తెలిపారు. ఇలా రాష్ట్రం రూ. 4,675 కోట్లు కేంద్ర అటవీ శాఖకు చెల్లిస్తే.. అందులోంచి రూ. 3,109 కోట్లు విడుదల చేశారని చెప్పారు. హరితహారానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 1,102 కోట్లు, కంపా నిధుల నుంచి రూ. 1,320 కోట్లు, ఉపాధి హామీ నుంచి రూ. 3,673 కోట్లు, హెచ్‌ఎండీఏ నుంచి రూ. 367 కోట్లు, జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 83 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు తమకు వచ్చే ఆదాయంలో పది శాతం నిధులను గ్రీన్బడ్జెట్కు కేటాయిస్తాయని, ఇట్ల వాటి నుంచి ఏడాదికి రూ. 1256 కోట్ల దాకా వస్తాయన్నారు. కరెంట్ లైన్ల కింద మొక్కలు పెట్టి తర్వాత వాటిని కొట్టేయడం కాకుండా ప్లాంటేషన్ మోడ్ మార్చడంపై దృష్టి పెడుతున్నామని, అది సాధ్యం కాకపోతే అండర్‌గ్రౌండ్ పవర్ లైన్లు వేయడంపై దృష్టి పెడతామని, కానీ ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. రాష్ట్రంలోని భూముల సర్వే త్వరలోనే ప్రారంభిస్తామని, కో ఆర్డినేట్స్‌తో కూడిన సరిహద్దులు చూపిస్తామని, దీంతో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు.
జూపార్క్ స్థలం ఫారెస్ట్ భూమి కాదు
బహదూర్‌పుర నియోజకవర్గంలో ఉన్న నెహ్రూ జూపార్క్ భూమి ఫారెస్ట్‌కు సంబంధించింది కాదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తొలి మూడేండ్లలో రూ. 1,396 కోట్లు ఖర్చు పెడితేనే గ్రీన్ కవర్ 3.67 శాతం పెరిగినప్పుడు ఆ తర్వాత సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే గ్రీన్ కవర్ కనీసం డబుల్ కావాలని, ఆ సర్వే వివరాలు ఇవ్వాలని ఒవైసీ అడిగారు. సీఎం బదులిస్తూ.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కవర్‌పై సర్వే చేయిస్తుందని, ఆ సర్వే రిపోర్టు 2023లో వస్తుందని తెలిపారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేయకుండా స్పష్టమైన ఆదేశాలిస్తామని, ఈ సమావేశాల్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పోదెం వీరయ్యకు సీఎం చెప్పారు.
గ్రీనరీలో ప్రపంచంలోనే రాష్ట్రానిది థర్డ్ ప్లేస్
గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో నాటుతున్న మొక్కల్లో 80 నుంచి 95 శాతం వరకు బతుకుతున్నాయని, గజ్వేల్‌లో 35 వేల ఎకరాల్లో అడవిని పునరుద్ధరించామని తెలిపారు.
భూములు లాక్కోవడం మా ప్రభుత్వ పద్ధతికాదు
ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం అసైన్డ్ భూములు లాక్కోవడం తమ ప్రభుత్వ పద్ధతి కాదని సీఎం చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ భూములు సేకరిస్తే ఇతరులకు ఇచ్చినట్టే పరిహారం ఇస్తున్నామన్నారు. దళిత, గిరిజన భూములు బలవంతంగా లాక్కున్నట్లు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. భద్రాచలం పట్టణానికి అవతల ఏపీ తీసుకున్న 5 గ్రామాలు తిరిగి తెలంగాణకు అప్పగించేలా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. ఏపీని సంప్రదించి ఆ గ్రామాలను ఇవ్వాలని కోరుతామని, వాళ్లు ఒప్పుకోకుంటే ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక పద్ధతి లేకుండా సీలేరు పవర్ ప్లాంట్ సహా ఏడు మండలాలు ఏపీకి కట్టబెట్టారని అన్నారు.
గ్రీన్ఫండ్ఏర్పాటు చేస్తున్నం
రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచడమే లక్ష్యంగా ‘తెలంగాణ గ్రీన్ ఫండ్’ పేరుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. సెంట్రల్ సర్వీసెస్ అధికారులు నెలకు తమ జీతం నుంచి రూ. 100 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ. 25 చొప్పున, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ. 500 చొప్పున ఈ ఫండ్‌కు నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. న్యాక్‌కు ప్రతి కాంట్రాక్టులో 0.1 పర్సెంట్ ఇస్తున్నట్టుగానే గ్రీన్ ఫండ్‌కు 0.1 శాతం ఇవ్వాలనే నిబంధన తీసుకువస్తున్నామని తెలిపారు. దీంతో ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు నిధులు సమకూరుతాయన్నారు. లైసెన్సుడ్ సర్వేయర్ల రెన్యూవల్ టైంలో రూ.1,000 చెల్లించేలా నిబంధన తెస్తున్నామని చెప్పారు. స్టూడెంట్ల నుంచి కూడా అడ్మిషన్ టైంలో రూ. 5 నుంచి రూ. 100 వరకు గ్రీన్ ఫండ్ కోసం తీసుకునేలా రూల్ తెస్తున్నామన్నారు.