కేంద్రం అసమర్థత వల్ల ఆహార భద్రతకు ముప్పు

కేంద్రం అసమర్థత వల్ల ఆహార భద్రతకు ముప్పు

కేంద్రంలోని బీజేపీకి పోగాలం దాపురించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయం, విద్యుత్ రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సంస్కరణల పేరుతో షావుకార్లకు  దోచి  పెట్టడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వస్తువులపై ధరలు పెంచుతూ ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. 

కేంద్రం అవివేకం వల్ల ఆహార భద్రతకు ముప్పు

ప్రధాని, కేంద్ర మంత్రుల అవివేకం వల్ల దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర అసమర్థత వల్ల దేశం వెనక్కిపోతోందని ఫైర్ అయ్యారు. బుద్ధుడు, గాంధీ మహాత్ముడు పుట్టిన ఈ నేల మీద బీజేపీ మరుగుజ్జులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చరిత్రలో హిట్లర్, ముస్సోలిన్ వంటి ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న కేసీఆర్...మోడీ, అమిత్ షాకు కూడా అదే గతి పడుతుందని చెప్పారు. 

రాజ్యాంగ సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నరు

రాజ్యాంగ సంస్థలను ఎగదోలుతూ ప్రతి పక్షాల ప్రభుత్వాలను కూలగొడుతున్నారని సీఎం మండిపడ్డారు. 11 రాష్ట్రాల్లో బీజేపీ అనైతికంగా ప్రభుత్వాలను కూలగొట్టిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ముగ్గురు సభ్యులు కూడా లేని బీజేపీ... తమ ప్రభుత్వాన్ని కూలగొడుతామంటూ ప్రగల్భాలు పలుకుతోందన్నారు. ఏక్ నాథ్ షిండేల పేరుతో బెదిరించాలని కేంద్రం చూస్తోందని, కానీ దానికి ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. దేశంలో ఏకపార్టీ ఉండాలని అమిత్ షా మాట్లాడుతున్నారని, బీజేపీని దేవుడు కూడా కాపాడలేరని కేసీఆర్ అన్నారు. సైన్యం రిక్రూట్ మెంట్ విషయంలో కూడా కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం పెరగడానికి కేంద్ర విధానాలే కారణమని ఆరోపించారు.

రాష్ట్ర బీజేపీ నేతలు అసమర్థులు

రాష్ట్రంలోని కేంద్ర మంత్రితో సహా మిగతా బీజేపీ నేతలు అసమర్థులు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వరి వేయాలని రాష్ట్ర రైతులను రెచ్చగొట్టి తీరా పంట చేతికొచ్చాక బీజేపీ నేతలు జాడపత్తా లేకుండా పోయారన్నారు. ధాన్యాన్ని కొనాలని తాము ఎంత మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు ఒక్కరూ కూడా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపించడానికి ప్రయత్నం చేయలేదన్నారు. ఆ సమయంలో నూకలు బుక్కాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు.  కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించి రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని చెప్పారు.