దేశం కోసం కూడా పోరాడుతం

దేశం కోసం కూడా పోరాడుతం
  • ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు
  • వడ్లను కేంద్రం కొంటదా?.. కొనదా?
  • రైతు సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తం: సీఎం కేసీఆర్
  • ఢిల్లీ దాకా యాత్రం చేస్తాం..
  • ప్రతి గ్రామంలో చావుడప్పు కొడతాం
  • రాష్ట్ర సర్కార్ ధర్నాలో సీఎం కామెంట్లు

హైదరాబాద్​, వెలుగు:  తాము చేస్తున్న ఆందోళన ఆరంభం మాత్రమేనని, అంతం కాదని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘వడ్లతో ప్రారంభం చేసినం.. డెఫినెట్​గా
దేశం కోసం కూడా పోరాటం చేస్తం” అని ప్రకటించారు. దేశంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం నాయకత్వం వహిస్తామని చెప్పారు. ‘‘క‌‌‌‌చ్చితంగా
జెండా లేవాల్సిందే.. దేశ వ్యాప్తంగా ఉద్యమం ర‌‌‌‌గ‌‌‌‌లాల్సిందే. ఈ విష‌‌‌‌యాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాలి. మరో పోరాటానికి సిద్ధం కావాలి” అని అన్నారు.
తెలంగాణలో పండే మొత్తం వడ్లను కొంటరో లేదో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. ‘‘మేం కొత్త కోరికలు కోరడం లేదు. పండించిన పంట మొత్తం
కొంటరా.. కొనరా.. అది మాత్రమే అడుగుతున్నం” అని ఆయన అన్నారు. వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లోని ధర్నాచౌక్​లో రాష్ట్ర
ప్రభుత్వం మహాధర్నా చేపట్టింది. సీఎం కేసీఆర్​, మంత్రులు, టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​
మాట్లాడుతూ.. ‘‘రైతు సమస్యలపై కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నది. ఒక్క తెలంగాణలోనే కాదు దేశం మొత్తం రైతులు గోస పడుతున్నరు. దేశ
సమస్యలపై పోరాటానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందే. రైతు ఉద్యమాన్ని ప్రజ్వలింపజేస్తున్నం. రైతు సమస్యలపై అందరితో మాట్లాడుతున్న.
పదవుల కోసం ఆశపడెటోళ్లం కాదు.. కేసులకు భయపడేటోళ్లం కాదు” అని చెప్పారు. ఉత్తర భారతదేశంలో రైతులు ఏడాది నుంచి ఢిల్లీలో ఆందోళనలు
చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘ఆకలిలో భారతదేశానిది 101 స్థానం. అసలు కేంద్రం పాలసీ ఏంది?  రైతులను బతకనిస్తరా
లేదా.. చెప్పాలి. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతోనే ఇష్టం లేకున్నా వరి సాగు వద్దని చెప్పినం’’ అని
అన్నారు. వరికి బదులుగా పెసర్లు, పల్లి పంటలు వేయాలని కోరుతున్నామని చెప్పారు.  పంట విస్తీర్ణంపై తాము అబద్ధాలు చెప్తున్నట్లు కేంద్రం
అంటోందని, అంత పండకపోతే కల్లాల వద్దకు బీజేపీ  నేతలు ఎందుకు వెళ్తున్నారని  ఆయన ప్రశ్నించారు.

బీజేపీ ఆఫీసు మీద బియ్యం కుమ్మరిస్తం
‘‘యాసంగిలో ధాన్యం వద్దని కేంద్రం చెబితే.. వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అంటున్నది. గత యాసంగిలో ఎఫ్​సీఐ చెప్తే.. 50 లక్షల టన్నుల బియ్యం
ఇచ్చినం. ఇంకా 5 లక్షల టన్నుల బియ్యం అట్లనే ఉన్నయ్​. మీరు తీసుకోకపోతే మా రైతుల మీద దిష్టితీసి బీజేపీ ఆఫీసు మీద కుమ్మరిస్తం.. జాగ్రత్త’’
అని కేసీఆర్​ హెచ్చరించారు. ‘‘మాట్లాడితే కేసులు అంటున్నరు.. దా కేసులు పెట్టు. కేసీఆర్‌‌‌‌ భయపడితే తెలంగాణ వచ్చేదా? వడ్లు కొంటరా.. కొనరా?
తేల్చి చెప్పండి. ఇది  రైతుల జీవన్మరణ సమస్య.  రైతులు విషం తాగి చావాల్నా? చెట్లకు వేలాడాల్నా? పదవులకు ఆశపడేది లేదు.. కేసులకు
భయపడే ప్రసక్తే లేదు. రైతులు నష్టపోకూడదన్నదే మా ఆరాటం.. పోరాటం. అవసరమైతే ప్రతి గ్రామంలో చావుడప్పు కొడ్తం. రణం చేయడంలో దేశంలో
టీఆర్​ఎస్​ను మించిన పార్టీ లేదు’’ అని ఆయన చెప్పారు. 

సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటున్నరు
‘‘ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి దాని సెంటిమెంట్​ను క్యాష్​ చేసుకొని మీరు రాజకీయం నడుపుతున్నరు. కాలం చెల్లిపోయింది.
అందరికీ అర్థమైపోయింది. ” అని వ్యాఖ్యానించారు.  ధాన్యం కొనుగోళ్ల గురించి తాము అడిగి 50 రోజులవుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకు లేదని
దుయ్యబట్టారు. ఇక్కడి బీజేపీ నాయకులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల దగ్గర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కేంద్రం కొనకుంటే ఎట్ల కొంటం: మంత్రులు, లీడర్లు
వ్యవస్థలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయని, వాళ్లు ధాన్యం కొనకుంటే రాష్ట్రమెలా కొంటుందని మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి ప్రశ్నించారు. నిప్పుతో బీజేపీ చెలగాటం
ఆడుతోందని మంత్రి జగదీశ్‌‌‌‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచాల్సిందేనని, మోడీ దిగిరావాల్సిందేనని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
అన్నారు. ధర్నాలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ పక్షనేత కె. కేశవరావు, ఎమ్మెల్యేలు 
సండ్ర వెంకటవీరయ్య, రసమయి బాలకిషన్‌‌‌‌ కూడా మాట్లాడారు.

ఢిల్లీ దాకా యాత్ర చేస్తం
రైతుల కోసం ఢిల్లీ వరకు వెళ్లేందుకు వెనుకాడబోమని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘రెండు, మూడు రోజులు చూసి యుద్ధం ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి
వరకు తీసుకెళ్తం.. హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో ప్రారంభ‌‌‌‌మైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగ‌‌‌‌దు. అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైతే ఢిల్లీ వ‌‌‌‌ర‌‌‌‌కు యాత్ర చేయాల్సిన ప‌‌‌‌రిస్థితి ఉంటది.. మా రైతులు
మళ్లీ నష్టపోవద్దు అనేదే మా ఆరాటం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతుల కోసం ధర్నా చేస్తున్నరు.. దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా? తెలంగాణ
రైతాంగం కోసం ఎక్కడి వరకైనా పోరాటం కొనసాగిస్తం..’’ అని తేల్చిచెప్పారు. ‘‘మా ఓపికకు ఓ హద్దు ఉంది. ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట
అడుగుతున్నా.. ‘వడ్లు కొంటారా? కొనరా?’. ఇదే విషయంపై ప్రధానికి బుధవారం లేఖ రాసిన. ధాన్యం కొంటామని ఇప్పటి వరకు కూడా కేంద్రం హామీ
ఇవ్వలేదు” అని అన్నారు. 


దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు ఫెయిల్​
దేశాన్ని పాలించడంలో కేంద్ర ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని కేసీఆర్​ అన్నారు.  తాము తెచ్చిన సాగు విధానాలతో రైతులోకం ఒక దారికి వచ్చిందని
చెప్పారు. ‘‘దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పని చేయడం లేదు. కేసీఆర్‌‌‌‌ వచ్చాక విద్యుత్ సమస్య ఎలా పరిష్కారమైంది? సమర్థత ఉంటే ఏ సమస్యకైనా
పరిష్కారం దొరుకుతది.. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్లు మించి వాడటం లేదు. మన
రాష్ట్రంలో తప్ప నిరంతర విద్యుత్‌‌‌‌ ఎక్కడా ఇవ్వట్లేదు. ఇది ఎవరి చేతగానితనం? ఎవరి అసమర్థత? విద్యుత్ ఇవ్వడం చేతకాక మోటార్లకు మీటర్లు
పెడతామంటరు. రాష్ట్రంలో మీటర్లు ఉండవు.. నీటి తీరువా లేదు.. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌‌‌‌, రైతుబంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ’’ అని
ఆయన అన్నారు.