నన్ను సంపినా అబద్ధం చెప్ప, లంగ మాటలు మాట్లాడ

నన్ను సంపినా అబద్ధం చెప్ప, లంగ మాటలు మాట్లాడ
  • దశలవారీగా దళితబంధు
  • ఏటా రెండు లక్షల కుటుంబాలకు వర్తింపజేస్తాం
  • నేను చెప్పిన్నంటే వంద పర్సెంట్​ అమలైతది 
  • దళితబంధు అంటే బాంబు పడ్డట్టు అదిరిపడ్తున్నరు
  • తెలంగాణ ధనిక రాష్ట్రమే.. సన్నాసులకు అర్థమైతలేదు
  • డైలాగులు.. డంబాచారాలు మస్తు కొట్టొచ్చు.. మేం కొట్టం
  • టీఆర్​ఎస్​లో చేరిన పెద్దిరెడ్డి, స్వర్గం రవి



హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిమితులను బట్టి దశలవారీగా ఏటా 2 లక్షల కుటుంబాలకో, 4 లక్షల కుటుంబాలకో దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌‌ చెప్పారు. దళితబంధు మహాయజ్ఞమని, ఈ స్కీం తెస్తే కొందరు అదిరిపడుతున్నారని విమర్శించారు. తనను చంపినా సరే గోల్​మాల్​ తిప్పనని, గారడి మాటలు చెప్పనని, అబద్ధాలు ఆడనని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, ఈ విషయం చాలా మంది సన్నాసులకు అర్థమైతలేదని మండిపడ్డారు.  మన రాష్ట్రాన్ని చూసి నేర్చుకునేందుకు వేరే దేశాల వాళ్లు కూడా వస్తారని ఆయన తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌‌ నేత స్వర్గం రవి తదితరులు టీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. వారికి కేసీఆర్‌‌  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక అందరూ తామే సిపాయిలం అంటున్నారని, లాస్ట్‌‌లో వచ్చి తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.  

దేశంలోనే మనం నంబర్​ వన్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నామని, ఇప్పుడు దేశంలోనే తెలంగాణ నంబర్‌‌ వన్‌‌ అయిందని సీఎం కేసీఆర్​  అన్నారు. దళితబంధు అమలు గురించి నాలుగైదేండ్లుగా పార్టీ సమావేశాల్లో చెప్తున్నానని, బడ్జెట్‌‌లోనే ఈ స్కీంకు రూ. వెయ్యి కోట్లు కేటాయించామని, కరోనా రావడంతో అమలు ఆలస్యమైందని తెలిపారు. ఎంబీసీల కోసం కార్పొరేషన్‌‌ పెట్టి బడ్జెట్‌‌ కేటాయించామని చెప్పారు. దళిత బీమా, చేనేత బీమా అమలుకు కొంత సమయం పడుతుందని, బీమా అమలుకు అవసరమైన వ్యవస్థ ఆయా శాఖలు సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ ​ఆదేశించారు. ‘‘దళిత బంధు ఇంప్లిమెంట్​ చేస్తమంటే.. దానికి  ఒకడు కీ అంటే,  ఒకడు కా అంటడు. బాంబుపడ్డట్టు అదిరిపడ్తున్నరు. ఈ స్కీం ఎవడన్నా ఆపుతడా.. ఎట్ల ఆపుతరు? ఆరునూరైనా ఒక్కసారి కేసీఆర్‌‌ చెప్పిండంటే అది ఆగది.. వంద పర్సెంట్‌‌ అమలు చేసి తీరుతం” అని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. 

సన్నాసులు మీకేం తెలుస్తది
‘‘ఒకసారి అసెంబ్లీల ఒకపార్టీ ఆయన మాట్లాడితే నేను చెప్పిన.. సన్నాసులు మీకేం తెలుస్తది.. నాదగ్గర ఇంకో రెండు, మూడు స్కీములున్నయ్‌‌. అవి అమలు చేస్తే మీరు గోలే బిడ్డ అని చెప్పిన” అని కేసీఆర్​ అన్నారు. ‘‘గోల్‌‌మాల్‌‌ తింపుడు..  గారడీ మాటలు మాట్లాడుడు.. లంగ మాటలు మాట్లాడుడు.. అబద్ధాలు చెప్పుడు.. జరగని పనులు కూడా జరుగుతయని చెప్పుడు మంచిది కాదు. నన్ను సంపినా అట్ల అబద్ధం చెప్ప. అట్ల చెప్పాల్సిన అక్కర కూడా లేదు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ధనిక రాష్ట్రమే. ఈ విషయం చాలామంది సన్నాసులకు అర్థం కావడం లేదు. రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా వస్తున్నయ్​. ఎమ్మెల్యేల జీతం ఆపైనా గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలని చెప్పిన. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మరెక్కడా అమలైతలేవ్​. వీటిని ఇతర దేశాల నుంచి వచ్చి నేర్చుకోవాల్సి పరిస్థితి ఉంది. డైలాగులు.. డంబాచారాలు మస్తుగ కొట్టొచ్చు.. మేం అట్ల కొట్టం” అన్నారు.  పీఆర్సీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు పెంచుతారని, తమ ప్రభుత్వం అందరికీ బేసిక్‌‌ పేపై 30 శాతం పెంచామన్నారు. ట్రాఫిక్‌‌ డ్యూటీ చేసే పోలీసులకు 30 శాతం రిస్క్‌‌ అలవెన్స్‌‌ ఇస్తున్నామని తెలిపారు.  

జానారెడ్డి మాట తప్పిండు
రెండేండ్లలో 24 గంటలూ కరెంట్‌‌ ఇస్తామని చెప్తే జానారెడ్డి గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని చెప్పి మాట తప్పారని, మొన్న నాగార్జునసాగర్‌‌లో పోటీ చేశారని కేసీఆర్​ అఅన్నారు. ‘‘కొందరు దేవుడు నోరిచ్చాడని అరాచకంగా, అశ్లీలంగా, అడ్డంపొడుగు మాట్లాడుతున్నరు. ఏనుగు పోతుంటే చిన్న జంతువులు అరుస్తయ్​. అరచేవాడు.. తుడిచేవాడు.. ఎడ్డిచ్చేవాడు ఎప్పుడూ ఉంటడు. మేము అవేమీ పట్టించుకోకుండా ముందుకుపోతం” అని అన్నారు.రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యల్లేవన్నారు. 

దళితుల పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసని, ఊర్లో కడుపేదలు ఎవరని అడిగితే దళితులేనని చెప్తారని సీఎం అన్నారు. తాను, చారి అనే జర్నలిస్టు మిత్రుడు కలిసి ‘సెబల్టన్‌  స్టడీస్‌’ అనే వేదిక ఏర్పాటు చేసి ప్రపంచంలోని 165 జాతులపై సాటి మానవులే అణచివేత కొనసాగించిన విధానాన్ని స్టడీ చేశామని ఆయన తెలిపారు. దేశంలోని దళితుల దుస్థితిపై అప్పుడే అధ్యయనం చేశామన్నారు. హుజూరాబాద్‌లో అమలు చేసే దళితబంధు పథకంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. 

నల్ల రంగంటే పడదు
తాను సీఎం అయ్యాక ఉమ్మడి సీఎం వాడిన నల్లరంగు కార్లు తాను వాడాల్సి వచ్చిందని, తనకు ఆ రంగంంటే ఇష్టం ఉండదు కాబట్టి తెల్లరంగు వేయించానన్నారు. ఇదే విషయాన్ని అప్పటి గవర్నర్‌‌ నర్సింహన్‌‌ ప్రస్తావించి.. ‘‘కేసీఆర్‌‌ నువ్వు పీసిడి ఉన్నవ్‌‌... కొత్త కార్లు కొనుక్కోవచ్చు కదా” అని అన్నారని,  అప్పటి దాకా రాష్ట్రం పరిస్థితి అంచనా వేయలేదని ఆయనకు చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నామన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనకు మంచి స్నేహితుడని, టీడీపీలో ఇద్దరం కలిసి పనిచేశామని కేసీఆర్​ చెప్పారు.