వరి వద్దు.. పంట మార్చండి

వరి వద్దు.. పంట మార్చండి
  • యాసంగి సాగుపై రైతులకు కేసీఆర్ సూచన
  • పల్లీ, మినుములు గిట్టుబాటైతున్నయా?
  • వనపర్తిలో రైతులతో ముచ్చట
  • పొలాల కాడ పంటల పరిశీలన
  • చీడల కంటే డేంజర్ లీడర్లున్నరని కామెంట్

హైదరాబాద్/వనపర్తి/గద్వాల, వెలుగు: యాసంగిలో వరి సాగు చెయ్యొద్దని రైతులకు సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆరుతడి పంటలే వేసుకోవాలన్నారు. ‘‘రైతులు వరిని వదిలి ప్రత్యామ్నాయ పంటల సాగును ఎంచుకోవాలి. వరే వేసి ఇబ్బంది పడే కంటే ఇతర పంటల మీద దృష్టి పెట్టండి. మార్కెట్లో డిమాండున్న పల్లీ, పత్తి, మినుములు, పెసర్లు, శనగల వంటివి వేయండి. తద్వారా పంట మార్పిడి కూడా జరుగుతుంది” అన్నారు. చేనుకు పట్టే చీడపీడల కంటే ప్రమాదంగా మారిన రాజకీయ నాయకుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. యాసంగిలో రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిని, పెద్దాఫీసర్లను ఆదేశించారు. జోగులాంబ గద్వాల​ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి తండ్రి ఇటీవల మరణించారు. గురువారం గద్వాలలో ఆయన కుటుంబాన్ని సీఎం పరామార్శించారు. తిరుగు ప్రయాణంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియంకొండ తండా పంచాయతీ పరిధిలో పంటలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. మినుములు, వేరుశనగ పంటల గిట్టుబాటుపై ఆరా తీశారు. రంగాపూర్ లో రైతులు మహేశ్వర్ రెడ్డి వేసిన మినుము, రాములు వేసిన వేరుశనగ పంటలను పరిశీలించారు. దిగుబడి, ధరలపై ఆరా తీశారు. ఐదెకరాలు మినుము వేసినట్టు మహేశ్వర్ రెడ్డి చెప్పాడు. టీ9 రకం మినుములు ప్రైవేట్లో కొన్నానని చెప్పాడు. ఎకరాకు 12 క్వింటాళ్ల దాకా వస్తున్నాయని, మద్దతు ధర రూ.6,300, మార్కెట్ ధర 8,0‌‌00పైనే ఉందని అన్నాడు. పల్లీ ఎకరాకు 15 క్వింటాళ్ల దాకా వస్తుందని, మద్దతు ధర 5,550, మార్కెట్ ధర 7,000 పైనే ఉందని రాములు చెప్పాడు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి దిగుబడి పెరిగిందన్నారు. తర్వాత కొత్తకోట మండలం విలియం కొండ తండా రోడ్డు వద్ద కల్లంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. కొన్ని వేరుశనగ చెట్లను పీకి కాయలు పరిశీలించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండటంతో దిగుబడి బాగా పెరిగిందని వెంకటయ్య చెప్పారు. డిమాండున్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. సీఎం వెంట పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులున్నారు.

బండ్లకు పరామర్శ
తండ్రిని కోల్పోయిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ను కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో మధ్యాహ్నం గద్వాల వెళ్లారు. ఎమ్మెల్యే తండ్రి వెంకట్రాంరెడ్డి ఫొటోకు దండ వేశారు. కుటుంబీకులను ఓదార్చి భోజనానంతరం హైదరాబాద్ వెళ్లారు.