బంగారు తెలంగాణగా చేసేదాకా విశ్రమించ

బంగారు తెలంగాణగా చేసేదాకా విశ్రమించ
  • మస్తు డెవలప్ అయినం
  • ఏడేండ్లలోనే దేశం గర్వించే స్థాయికి ఎదిగినం
  • ప్రజలకు సీఎం కేసీఆర్ స్టేట్ ఫార్మేషన్‌ డే విషెస్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేండ్లలోనే అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని, దేశం గర్వించే స్థాయిలో తెలంగాణను నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రోడ్లు, ఇతర మౌలిక వసతులను.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో డెవలప్‌ చేసుకుంటూ వస్తున్నామని కేసీఆర్ అన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన రంగాలను సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులపై ఆధారపడిన వారితో పాటు, అన్ని వర్గాలకూ తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా నిలబడిందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్లలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడంలో తమ ప్రభుత్వ అకుంటిత దీక్ష ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించి, గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ ఘన విజయంలో సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కరోనా వల్ల ఖజానాకు ఇబ్బంది కలిగినా, ప్రజల సహకారంతో ముందకు పోతున్నామని చెప్పారు. ప్రజలు తనమీద ఉంచిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించబోనని అన్నారు.