ఫారెస్ట్​ భూముల చుట్టూ ఫెన్సింగ్ పెడ్తం

ఫారెస్ట్​ భూముల చుట్టూ ఫెన్సింగ్ పెడ్తం
  • శాశ్వత సరిహద్దులు ఏర్పాటు చేస్తం: సీఎం 
  • వచ్చే నెల 8 నుంచి పోడు భూముల క్లెయిమ్ అప్లికేషన్లు 
  • అడవి లోపల పోడు చేస్కుంటున్న గిరిజనులకు ప్రభుత్వ భూములు ఇస్తం  
  • పోడు సమస్యల పరిష్కారానికి జిల్లాల్లో అఖిలపక్ష మీటింగులు 
  • 12 జిల్లాల్లోనే 87 శాతం పోడు భూముల ఆక్రమణ 
  • ఉన్నత స్థాయి సమీక్షలో కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: ఫారెస్టు భూములకు శాశ్వత సరిహద్దులను ఫిక్స్ చేసి, ప్రొటెక్షన్ ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ట్రెంచ్ పైన గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ట్రెంచ్ ఏర్పాటుకు అటవీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు గిరిజనులు, తదితరుల నుంచి పోడు భూముల క్లెయిమ్ అప్లికేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెల 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి, ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీలను నియమించాలన్నారు. రెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారిని నియమించాలని.. సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్ లో పోడు సమస్యలు, అడవుల రక్షణ–పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 

అడవిలో  పోడు చేసుకుంటున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను కేటాయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి.. వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనే 87% పోడు భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. పోడు సమస్యల పరిష్కారం, అటవీ భూముల రక్షణకు సంబంధించి అన్ని జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడంతో పాటు.. ఆ తర్వాత అటవీ భూమి  ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుంచి ఏకాభిప్రాయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఈ సమావేశాలు నిర్వహించాలన్నారు. 

బయటి శక్తులే అడవులను నాశనం చేస్తున్నయ్... 
అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని.. అడవి బిడ్డలే అడవిని నాశనం చేయరని సీఎం చెప్పారు. బయటి నుంచి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయని, వాటిని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. అడవులను కాపాడుకునే అమాయకులు ఎవరు? అడవులను నాశనం చేయాలనుకునే వాళ్లెవరు అనేది గుర్తించడం ముఖ్యమని చెప్పారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తూ, అటవీ భూములను రక్షిస్తూ.. అడవుల పెంపకానికి కృషి చేయాలని సూచించారు. అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించడంతో పాటు అన్ని స్థాయిల్లోని సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. 

అడవులను పెంచాలే..  
సోషల్ ఫారెస్టులో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా, ఒక అడవితో సమానం కాదని సీఎం అన్నారు. పదెకరాల అడవి, కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ లో అడవుల పునరుజ్జీవం చేపట్టినట్లుగానే, అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడవుల్లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో అడవులను అభివృద్ధి చేయాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి మంచి ఆలోచన అని అధికారులను అభినందించారు.

గంజాయి సాగు చేస్తే పథకాలు బంద్ 
గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు, రైతు బీమా, కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతో పాటు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే, పట్టాలు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టి.. తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించాలని సూచించారు.