ఢిల్లీకి పోతం.. యాసంగిపై తేల్చుకుంటం

ఢిల్లీకి పోతం.. యాసంగిపై తేల్చుకుంటం
  • ప్రతి గింజ కొంటం
  • ఉత్తరాది రైతు ఉద్యమ మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారం
  • తొందరొద్దు.. వానలు తగ్గినంక కోతలకు పొండి 
  • మార్కెట్​కు వడ్లు నిమ్మలంగా తీసుకురండి
  • ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై తేల్చాలె
  • కేంద్ర ప్రభుత్వానికి సీఎం డిమాండ్లు

హైదరాబాద్, వెలుగు: ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో పండిన వడ్లను చివరి గింజ దాకా కొంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. శనివారం తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ వరి కోసే విషయంలో రైతులెవరూ తొందరపడొద్దని, నిమ్మలంగానే వడ్లు మార్కెట్లకు తెచ్చుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాత కోతలకు పోవాలన్నారు. ఆదరాబాదరగా తెచ్చి మార్కెట్‌‌‌‌లో పోస్తే.. వడ్లు తడిసే అవకాశం ఉందన్నారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు, అధికారులను వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్తున్నామని వెల్లడించారు. యాసంగిలో ఎన్ని వడ్లు తీసుకుంటారో చెప్పాలని అడిగితే కేంద్రం చెప్పట్లేదని, అందుకే ఢిల్లీకి పోయి సంబంధిత మంత్రులు, ఆఫీసర్లను నేరుగా కలిసి తేల్చుకొస్తామని, అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలిసి వస్తామని చెప్పారు. వడ్ల విషయంలో స్థానిక బీజేపీ నేతల బండారం బయటపడిందని, వాళ్లు ఇకనైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందని, తాము అవలంబిస్తున్నవి తప్పుడు విధానాలు అని తెలుసుకుని ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పారని కేసీఆర్ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ నిర్బంధాలను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని 13 నెలల పాటు పోరాడిన రైతులకు, రైతు నాయకులకు శుభాకాంక్షలు. సాగు చట్టాల రద్దుతో దేశ రైతులంతా రిలీఫ్ అవుతున్నారు. రైతుల పోరాటం విషయంలో కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఉగ్రవాదులని, దేశద్రోహులని నిందించారు. వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. రైతులకు మద్దతుగా బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి ట్వీట్ పెడితే.. ఆమెపైనా దేశద్రోహం కేసు పెట్టారు. చట్టాలను వెనక్కి తీసుకున్నాక అలాంటి కేసులను కొనసాగించడంలో అర్థం లేదు. కేసులను వెనక్కి తీసుకుంటే ధర్మంగా ఉంటది. ఈ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారు. వాళ్ల కుటుంబాల బాధ్యతను కేంద్రం తీసుకోవాలి. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లిస్తాం. ఇందుకోసం రూ.22.5 కోట్లు విడుదల చేస్తున్నాం. మృతుల వివరాలు ఇవ్వాలని రైతు సంఘం నాయకులను అడిగినం. మా మంత్రులు, నేను స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా అందిస్తాం’’ అని సీఎం తెలిపారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో కేంద్రం మాటలను ఇప్పటికీ ఎవరూ నమ్ముతలేరని, ఐదు రాష్ట్రాల ఎన్నికల స్టంట్‌‌‌‌‌‌‌‌గానే చూస్తున్నారని కేసీఆర్ అన్నారు. కనీస మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం కోసం పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలె
కొత్త విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘‘వ్యవసాయానికి మేము ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కొత్త కరెంట్ చట్టం తెచ్చి.. మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తున్నది. నిధులు నిలిపేస్తామని బెదిరిస్తున్నది. ఇది నియంతృత్వ వైఖరి. మీటర్లు పెట్టడానికి మేం సిద్ధంగా లేం. రాష్ట్రాల మీద మీ పాలసీని రుద్దొద్దు. మెడపై కత్తి పెట్టొద్దు. విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్డు ఎక్కుతారు”అని కేసీఆర్​ హెచ్చరించారు.

మా సహనాన్ని పరీక్షించొద్దు
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను తేల్చాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ఏడేండ్ల నుంచి ఎన్ని వందల సార్లు అడిగినా కేంద్రం తేల్చడం లేదు. ఓపికకు కూడా హద్దు ఉంటది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇప్పటికైనా వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్‌‌‌‌కు రిఫర్ చేయాలి. మూడు, నాలుగు నెలల్లో వాటాలు తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలి. ట్రిబ్యునల్‌‌‌‌కు పంపించే విషయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వల్లే ఆలస్యమైందని బీజేపీ వాళ్లు అడ్డందిడ్డం మాట్లాడుతున్నరు. ట్రిబ్యునల్​కు పంపిస్తానంటే ఏ కుక్కలకొడుకైనా వద్దంటడా?’’ అని మండిపడ్డారు. ట్రిబ్యునల్‌‌‌‌కు పంపకుండా కేంద్ర ప్రభుత్వమే ఆలస్యం చేస్తోందని, దీనిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తామన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపిన అంశాలపై కేంద్రం స్పందించడం లేదని, ఎస్టీల రిజర్వేషన్ల పెంపునకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికి 50 సార్లు లేఖ రాశామని కేసీఆర్ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా స్పందన లేదన్నారు. ఈ అంశాలపై ఏదో ఒకటి చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కులాల వారీగా లెక్కింపులో సెన్సిటివిటీ ఏముంది?
‘‘బీసీ కులాల్లోని జనాభా లెక్కింపు చేపట్టాలని కోరుతున్నాం. అందులో తప్పేమీ లేదు. కులాల వారీ లెక్కింపులో సెన్సిటివిటీ ఉందని కేంద్రం అంటోంది. అందులో సెన్సిటివిటీ ఏముంది? అట్లా మాట్లాడడం తెలివితక్కువ ముచ్చట అయితది. ఎస్సీ, ఎస్టీల లెక్క తేల్చినట్టే మిగిలిన అన్ని కులాల లెక్క తేల్చాల్సిందే. మన దేశంలో క్యాస్ట్, క్యాస్టిజం ఎప్పటి నుంచో ఉన్నది. ప్రభుత్వాలే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తున్నయి. ఇలాంటప్పుడు కులాల వారీ లెక్కింపును ఆపడంలో అర్థం లేదు. బీసీల కులాల వారీగా జనాభా లెక్కింపు చేపట్టాలి’’ అని సీఎం కేసీఆర్​ డిమాండ్ చేశారు.