
కరీంనగర్ : దేశబాగు కోసం అవసరమైతే జాతీయపార్టీ స్థాపించడానికి సిద్ధమన్నారు గులాబీబాస్ కేసీఆర్. ఆదివారం కరీనంగర్ లో ప్రచార శంఖారావం పూరించిన KCR.. జాతీయపార్టీలనే టార్గెట్ చేశారు. ఇన్నేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఇప్పటికీ తాగడానికి నీళ్లు లేవన్నారు. ఇప్పటికీ వేలాది గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. దేశాన్ని బాగుచేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందేనన్నారు. ఇప్పటికీ తనతో చాలామంది నేతలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ కోసం పిలుపునిచ్చారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కరీంనగర్ ఎంపీగా వినోద్‌ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపని వీరుడు వినోద్ అని.. దేశంలో ఫెడరల్ సమాఖ్య వస్తే.. వినోద్ కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. వినోద్ కేంద్ర మంత్రి అయితే.. కరీంనగర్ సమస్యలన్నింటినీ తీరుస్తారని సీఎం హామీ ఇచ్చారు. అందుకే వినోద్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు