కొండపాక, (కుకునూరు పల్లి), వెలుగు: మహిళ మృతి కేసులో ఆస్తి కోసమే అత్తను అల్లుడు చంపినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు వెల్లడించారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఏలూరు రమ అలియాస్ రాములమ్మ(60), భర్త చనిపోవడంతో సార్లవాడలో చాయ్ హోటల్ నడుపుతోంది.
తన చిన్న కూతురిని ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన అక్కన్నగారి జీవన్ రెడ్డి(30) కి ఇచ్చి పెండ్లి చేసింది. రాములమ్మకు చెందిన 3 ఎకరాల భూమిని దక్కించుకునేందుకు, కొన్నాళ్లుగా అత్తను చంపేందుకు అల్లుడు ప్లాన్ చేశాడు. ఆర్నెళ్ల కింద ఆమె ఇంటికి రాత్రిపూట నిప్పుపెట్టడడంతో అప్రమత్తమై తప్పించుకుంది. ఈనెల 6న తన ఫ్రెండ్స్ జీవన్, పాండుతో కలిసి జీవన్ రెడ్డి.. అత్త ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టి, కండువాతో ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
ఘటనపై కేసు నమోదు చేసి తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. జీవన్ రెడ్డితో పాటు అతనికి సహకరించినవారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద 3 బైక్ లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జీవన్ రెడ్డితో పాటు మరో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు
తెలిపారు.
