అవసరమైతే కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతం

అవసరమైతే కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతం

మార్చి 8న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు స్వల్పంగా పెరుగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో శనివారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ..  కరెంటు విషయంలో వంద శాతం నిలకడగా ఉన్నామన్నారు.  గత ఆరేళ్ల కాలంలో ఒకే ఒక్కసారీ ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలను స్వల్పంగా పెంచామని, మరోసారి పెంచాల్సి వస్తే పెంచుతన్నామన్నారు. దీనిపై ప్రజలకి వివరణ ఇస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా.. ప్రభుత్వ సంస్థల మనుగడ కోసం పెంచుతామని అన్నారు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్ను ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా కొనసాగుతుందన్నారు.

సాధ్యమైనంత వరకు పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రభుత్వం కట్టిస్తుందని కేసీఆర్‌ అన్నారు. పోడు భూములకు రైతుబంధు పథకం వర్తించదని, కాని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.