కొత్తగూడెంపై బీఆర్​ఎస్ స్పెషల్​ ఫోకస్​

కొత్తగూడెంపై బీఆర్​ఎస్ స్పెషల్​ ఫోకస్​
  •     పొంగులేటిని ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హైకమాండ్​
  •     జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యకు అధికార పార్టీ గాలం?
  •     నియోజకవర్గాల్లో తిరుగుతున్న సీఎం పంపిన టీంలు 
  •     కొత్తగూడెం, ఇల్లెందు ఇన్​చార్జీలుగా  పల్లా, తాతా మధు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్​ ఫోకస్​ పెట్టారు. ప్రధానంగా  కొత్తగూడెం నియోజకవర్గంపై  ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పోటీ చేసే అవకాశం ఉండడంతో, ఆయనకు గట్టి  పోటీ ఇచ్చేందుకు  బీఆర్​ఎస్​ హైకమాండ్​ రెడీ అవుతోంది.  కొత్తగూడెంతో పాటు  ఇల్లెందులో  రాజకీయ వాతావరణాన్ని, క్షేత్రస్థాయి రిపోర్టును, అభ్యర్థుల బలాబలాలను తెలుసుకునేందుకు బీఆర్​ఎస్​ స్పెషల్​ టీమ్​లను రంగంలోకి దింపింది.

ఇందులో భాగంగానే తొమ్మిది మందితో కూడిన  టీమ్​లు మూడు రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో వివరాలను ఆరా తీస్తున్నాయి.  మరో వైపు పొంగులేటి వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యపై సీఎం నజర్​ ఉన్నట్టు  వినిపిస్తోంది. కనకయ్యను బీఆర్​ఎస్​లోకి ఆహ్వానించి పొంగులేటికి పోటీ ఇచ్చే ప్లాన్​ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.  

పొంగులేటి పంతం నేపథ్యంలో.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్​ఎస్​ పార్టీ నుంచి  ఒక్కరిని కూడా అసెంబ్లీ గడప తొక్కనీయనని పొంగులేటి  చేసిన కామెంట్ల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య  పోటీ  సీరియస్​గా మారుతోంది.  ఇదిలా ఉండగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒకే  జనరల్​ సీటు  కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పొంగులేటి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని చుంచుపల్లి మండలంలో క్యాంప్​ ఆఫీస్​ను పది రోజుల కిందట పొంగులేటి ప్రారంభించారు. అంతకు ముందు కొత్తగూడెంలో మోటార్​ సైకిల్​ ర్యాలీ నిర్వహించారు. తరుచూ క్యాంప్​ ఆఫీస్​లో ఉంటూ తన అనుచరులతో పాటు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ అసంతృప్తి నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి పొంగులేటి పక్షాన చేరారు. ఇల్లెందు నుంచి కాంగ్రెస్​ తరుపున కోరం కనకయ్య పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.
 

కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేస్తే ఆయనను దీటుగా ఎదుర్కొనేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. ఇదే క్రమంలో ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలపై దృష్టి సారించారు.   కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియతో వేర్వేరుగా నాలుగు రోజుల కిందట సీఎం ప్రగతి భవన్లో మాట్లాడారు. ఇంటిలిజెన్స్​ రిపోర్టులు, సర్వేల్లో వచ్చిన వివరాలను సీఎం వారి దృష్టికి తీసుకెళ్లినట్టుగా ప్రచారం సాగుతోంది.   కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో  సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో పాటు బలమైన క్యాండెట్ల కోసం సీఎం ఆరా తీస్తున్నారనే ప్రచారం  జోరుగా సాగుతోంది.  

మినిస్టర్​ హరీశ్​ రావు పర్యటన!

జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గ ఇన్​చార్జిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డిని, ఇల్లెందు నియోజకవర్గ ఇన్​చార్జిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదనరావును నియమించినట్టు బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మరో వారం పది రోజుల్లో  మినిష్టర్​ హరీశ్​రావు కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉన్నట్టు టీఆర్​ఎస్​ నేతలు చెబుతున్నారు. పాలేరు నుంచి బీఆర్​ఎస్​ తరుపున తుమ్మల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. కాగా తప్పని పరిస్థితుల్లో మాజీ మంత్రి, సీనియర్​ నేత తుమ్మల నాగేశ్వరరావును కొత్తగూడెం నుంచి పోటీలోకి దింపే అవకాశాలను బీఆర్​ఎస్​ పార్టీ పరిశీలిస్తుండడం గమనార్హం.

ఇదిలా ఉండగా వనమా వెంకటేశ్వరరావుతో పాటు, స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాస్​, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​, రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్రలలో ఎవరు బలమైన అభ్యర్థులుగా ఉంటారనే అంశంపైనే ఈ టీం సర్వే చేసిందనే  ప్రచారం సాగుతోంది. మరో వైపు పొంగులేటి బలాబలాలను సీఎం పంపిన బృందం పరిశీలిస్తొంది. పొంగులేటి ఒకవేళ ఖమ్మం నుంచి పోటీ చేస్తే కొత్తగూడెం నుంచి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావును కాంగ్రెస్​ నుంచి బరిలో దింపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వనమాపై అనర్హత వేటు పడితే ఆయన పార్టీ నుంచి చేజారకుండా సీఎం జాగ్రత్త పడ్తూ  కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేస్తే అష్టదిగ్భంధనం చేసేలా బీఆర్​ఎస్​   ఇప్పటి నుంచే ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

కోరం కనకయ్యకు గాలం.. 

మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యకు బీఆర్​ఎస్​ నేతలు గాలం వేస్తున్నారు. బీఆర్​ఎస్​ నుంచి కోరం మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ఇటీవలి కాలంలో కాంగ్రెస్​లో చేరారు. పొంగులేటికి ప్రధాన అనుచరుడిగా ఉన్న కోరం కనకయ్యను బీఆర్​ఎస్​లోకి తీసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి పొలిటికల్​గా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని బీఆర్​ఎస్​ హైకమాండ్​ భావిస్తోంది.  ఇందులో భాగంగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తరుపున అయన ముఖ్య అనుచరులు కొందరు ఇటీవలి కాలంలో కోరం కనకయ్యతో మంతనాలు సాగించారు. మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవితతో పాటు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ కూడా కనకయ్యను బీఆర్​ఎస్​లోకి రావాలంటూ ఆహ్వానించిన దాఖలాలున్నాయి.