కేసీఆర్​కు కోలుకోవడానికి కొంత టైమ్ పడుతుంది : కేటీఆర్ 

కేసీఆర్​కు కోలుకోవడానికి కొంత టైమ్ పడుతుంది : కేటీఆర్ 
  • పోయిన నెల 16 నుంచి ప్రగతి భవన్​లోనే సీఎం

హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్​ ఇంకా కోలుకోలేదు. ముందు వైరల్​ ఫీవర్​తో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడు చెస్ట్​ఇన్​ఫెక్షన్​కు గురయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్​శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘సీఎం కేసీఆర్​కు కొద్ది రోజుల కింద వైరల్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు ఛాతిలో ఇన్ ఫెక్షన్ అయింది. ఇది బ్యాక్టీరియల్ ఇన్‌‌ఫెక్షన్ కావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది” అని ఆయన తెలిపారు. ఇంతకుముందు సెప్టెంబర్​26న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్ చేశారు.

అప్పటికే వారం రోజులుగా వైరల్​ ఫీవర్, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నట్లు చెప్పారు.‘‘సీఎం ఆరోగ్యాన్ని ప్రగతిభవన్‌‌లోనే  వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు” అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం తర్వాత.. 

పోయిన నెల 16న సీఎం కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రగతి భవన్​ చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆరోజు రాత్రి నుంచే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన బయటకు రావడం లేదు. శుక్రవారం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’​ కార్యక్రమానికి కేసీఆర్ ​హాజరవుతారని షెడ్యూల్​లో ప్రకటించినప్పటికీ, ఆయనకు బదులుగా మంత్రి హరీశ్​రావు అటెండ్​అయ్యారు. బీఆర్ఎస్ ​పార్టీలో బుజ్జగింపులు కూడా మంత్రులు కేటీఆర్, హరీశ్ ​రావే చూసుకుంటున్నారు. ప్రగతి భవన్​కు ఎవరు వెళ్లినా సీఎంను కలవనీయడం లేదు. పల్లా రాజేశ్వర్​రెడ్డికి జనగామ సీటు కూడా హరీశ్​రావు సీఎంతో చెప్పి ఫైనల్​ చేసినట్టు చర్చ జరుగుతోంది.

నలుగురికి చైర్మన్​ పదవులు ఇచ్చి సర్దుబాటు చేయడం కూడా ఇద్దరు మంత్రులే డిసైడ్ చేసినట్లు తెలిసింది. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే హరీశ్​రావు, కేటీఆర్ సీఎంకు చెప్పి అంగీకారం తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు నివేదికల రూపంలో సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ బయటకు వస్తేనే పార్టీలో జోష్ లో వస్తుందని.. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్​లీడర్లు, కార్యకర్తలు​భావిస్తున్నారు. సార్ తొందరగా బయటకు రావాలని, ఆయన ఒక్క స్పీచ్​ ఇస్తే రాష్ట్రంలో పొలిటికల్​ యాంగిల్​వన్​సైడ్​ అవుతుందని అంటున్నారు.