టీఎస్​పీఎస్సీ పేపర్లా.. మార్కెట్లో కూరగాయలా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

టీఎస్​పీఎస్సీ పేపర్లా.. మార్కెట్లో కూరగాయలా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ.. ఇప్పుడు లిఫ్ట్, లిక్కర్, లీక్ స్కామ్​లకు కేంద్రంగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఎస్ ​పీఎస్సీ ఎగ్జామ్ ​పేపర్లు మోండా మార్కెట్​లో కూరగాయల లెక్క తయారయ్యాయని విమర్శించారు. పేపర్ల లీక్​ విషయంలో సీఎం కేసీఆర్ బాధ్యత వహించి సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్​లోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో జరిగిన నిరుద్యోగులకు భరోసా సదస్సులో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. నిరుద్యోగుల వెంట తాను ఉంటానని.. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. పేపర్ల లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని చెప్పారు. పేపర్ల లీక్ కేసులో కస్టడీలో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి తదితరులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. 

టీఎస్​ పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీక్​కు బాధ్యులైన వారికి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలన్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హెల్ప్ లైన్, పౌష్టికాహారం, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అకా ల వర్షాలతో నష్టపోయిన రైతుల బాధలు.. 30 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకుండా.. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వెళ్లిన కవిత కోసం మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్​ఢిల్లీకి పంపారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు విద్యా వ్యవస్థపై ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదని మండిపడ్డారు. యూనివర్సిటీలలో వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయన్నారు. వేలాది ఫైల్స్ ప్రగతిభవన్​లో పెండింగ్​లో ఉన్నాయన్నారు.