కేసీఆర్ ఫీవర్ నుంచి కోలుకుంటే.. సెప్టెంబర్ 29న కేబినెట్ భేటీ!

కేసీఆర్  ఫీవర్ నుంచి కోలుకుంటే.. సెప్టెంబర్ 29న కేబినెట్ భేటీ!

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకుని నార్మల్ అయితే.. ఈ నెల 29న స్టేట్ కేబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తున్నది. గవర్నర్ కోటాలో రాష్ట్ర కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. ఈ అంశంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఏ కారణంగా వాళ్లని గవర్నర్ తిరస్కరించారు.. వాటికి వివరణ ఇస్తూ కేబినెట్ మళ్లీ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 

దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కూడా మంత్రివర్గం చర్చించే చాన్స్ ఉన్నట్లు సమాచారం. పీఆర్సీ కమిటీ ఏర్పాటుతో పాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుపై కేబినెట్ ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది. వీటితో పాటు ఇప్పటికే అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయాల్సిన దానిపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. 

అదేవిధంగా, అసైన్డ్ భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించే విషయమై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్​లకు అవకాశం ఇచ్చేలా నిర్ణయాలు ఉండనున్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతున్నది.