నేడు ‘పాలమూరు’కు సీఎం కేసీఆర్

నేడు ‘పాలమూరు’కు సీఎం కేసీఆర్

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు సీఎం కేసీఆర్‌‌ గురువారం వెళ్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కరివెన, వట్టెం, నార్లాపూర్‌‌, ఏదుల రిజర్వాయర్లు, పంపుహౌస్‌‌ పనులను ఆయన పరిశీలిస్తారు. ప్రాజెక్టులో ప్రధాన పంపుహౌస్‌‌ అయిన నార్లాపూర్‌‌పై ఈ టూర్‌‌లోనే సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదుల రిజర్వాయర్‌‌ సైట్‌‌లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలోని ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్టులపై ఆయన అధికారులతో విస్తృత స్థాయిలో సమీక్షిస్తారు.

ఇదీ సీఎం షెడ్యూల్​

సీఎం కేసీఆర్‌‌ ఉదయం 9.10 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌‌లో బేగంపేట ఎయిర్‌‌పోర్టు నుంచి బయల్దేరి భూత్పూర్‌‌ సమీపంలోని కరివెన రిజర్వాయర్‌‌కు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటారు. అరగంటపాటు రిజర్వాయర్‌‌, పంపుహౌస్‌‌ పనులను పరిశీలిస్తారు. ఉదయం 10.15 గంటలకు కరివెన నుంచి బయల్దేరి  ఉదయం 10.40 గంటలకు బిజినేపల్లి సమీపంలోని వట్టెం రిజర్వాయర్‌‌కు చేరుకుంటారు. 20 నిమిషాల పాటు అక్కడి పనులను పరిశీలించి ఇంజనీర్లకు సూచనలు చేస్తారు. ఆపై ఉదయం 11.20 గంటలకు నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌, పంపుహౌస్‌‌ల వద్దకు సీఎం చేరుకుంటారు. అరగంటల పాటు ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు గోపాల్‌‌పేట సమీపంలోని ఏదుల రిజర్వాయర్‌‌కు చేరుకుంటారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లతో కలిసి లంచ్​ చేస్తారు.

కృష్ణాపై ఫోకస్

టీఆర్‌‌ఎస్‌‌ తొలి ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఫోకస్‌‌ పెట్టి.. కృష్ణా ప్రాజెక్టులను విస్మరించింది. కృష్ణా నదిలో భారీ వరదలు వచ్చినా మన లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ పథకాల నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర లిఫ్టుల పరిస్థితిపై ‘వెలుగు’ కథనం ప్రచురించింది. సీఎం కేసీఆర్​ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నాలుగురోజుల క్రితం సమీక్షించి, త్వరలోనే తానే అక్కడికి వెళ్తానని తెలిపారు. అందుకు అనుగుణంగా గురువారం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనతో పాటు ఆన్‌‌ గోయింగ్‌‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంపైన సీఎం దృష్టి పెట్టారు. ఆయా ప్రాజెక్టుల వారీగా ఉన్న ఇబ్బందులను తెలుసుకొని, వాటి పరిష్కారంపై ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఏదుల ప్రాజెక్టు సైట్‌‌‌‌లోనే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలోని ఆన్‌‌‌‌గోయింగ్‌‌‌‌ ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. ప్రాజెక్టుల వారీగా ప్రాజెక్టుల స్టేటస్‌‌‌‌, ఎక్కడెక్కడ ఏయే పనులు చేయాలి, అవి పూర్తవ్వడానికి ఎంతమేరకు నిధులు అవసరమో సీఎం అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఏదుల రిజర్వాయర్​ నుంచి హెలిక్యాప్టర్‌‌‌‌లో బయల్దేరి సాయంత్రం 6.15గంటలకు హైదరాబాద్‌‌‌‌కు చేరుకుంటారు.

నార్లాపూర్​పై క్లారిటీ వచ్చే చాన్స్​

నార్లాపూర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు మట్టి కొరత ఉండటంతో రాక్‌‌‌‌ఫిల్‌‌‌‌ డ్యాం నిర్మించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. రాక్‌‌‌‌ఫిల్‌‌‌‌ డ్యాం నిర్మించిన అనుభవం లేకపోవడం, నిర్వహణ కూడా కష్టమేననే భావనతో ఈ ప్రతిపాదనను సీఎం పక్కనపెట్టారు. డ్యాం కట్ట ఎత్తు, వెడల్పు, స్టోరేజీ కెపాసిటీని తగ్గించి రిజర్వాయర్‌‌‌‌ నిర్మిద్దామని ఇటీవల సమీక్షలో ఆయన సూచించారు. తాను స్వయంగా ప్రాజెక్టు సైట్‌‌‌‌ను చూసిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సర్జ్‌‌‌‌పూల్‌‌‌‌కు బదులు ఇక్కడ ఓపెన్‌‌‌‌ పంపుహౌస్‌‌‌‌ నిర్మించడానికే సీఎం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. సీఎం టూర్‌‌‌‌లోనే ఈ రిజర్వాయర్‌‌‌‌, పంపుహౌస్‌‌‌‌పై క్లారిటీ వచ్చే అవకాశముందని ఇంజనీర్లు చెప్పారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి