నేడు యాదాద్రికి కేసీఆర్​

నేడు యాదాద్రికి కేసీఆర్​

చినజీయర్​స్వామితో కలిసి పనుల పరిశీలన

ఆలయ పునఃప్రారంభ తేదీ ఖరారు చేసే అవకాశం

మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై అధికారులకు సూచనలు

యాగ స్థలం, వీవీఐపీ సూట్ పరిశీలన

సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణం పనులను చినజీయర్​స్వామితో కలిసి పరిశీలించనున్నారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని.. తర్వాత ఆలయ అభివృద్ధి పనులు, ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్​ల నిర్మాణ పనులను, యాదాద్రి కొండ చుట్టూ నిర్మాణంలో ఉన్న 5.2 కిలోమీటర్ల రింగ్ రోడ్ పనులను పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించనున్న మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నట్లు తెలిసింది. తర్వాత దేవాదాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయా?

గత నెలలో పర్యటించినప్పుడు సూచించిన మార్పులతోపాటు ప్రస్తుతం ఎంత మేరకు పనుల పురోగతి జరిగింది? ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పనులు జరుగుతున్నాయా? ఇంకా ఎంత మేర మిగిలి ఉన్నాయి? అనే దానిపై అధికారులతో చర్చించనున్నారు. ఫిబ్రవరిలో ఆలయ పున:ప్రారంభం చేయాలని నిర్ణయించిన కేసీఆర్.. నేటి పర్యటనతో తేదీ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. మహాసుదర్శన యాగాన్ని 100 ఎకరాల స్థలంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్, చినజీయర్​స్వామి సంకల్పించిన విషయం తెలిసిందే. కొండకు ఆనుకుని గోశాల నుంచి గండి చెరువు వరకు ఉన్న స్థలాన్ని యాగం కోసం ముందుగా పరిశీలించనున్నారు. ఆలయ ప్రారంభం సమయంలో వీవీఐపీలతోపాటు దేశం నలుమూలల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు వచ్చే అవకాశం ఉన్నందున గుట్టపై రూ.104 కోట్లతో నిర్మిస్తున్న వీవీఐపీ సూట్​ను పరిశీలించనున్నారు.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి