
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ కు వెళ్లారు. ఈ సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. కేసీఆర్ వెంట.. రాష్ట్ర అధికారులు ఉన్నారు.
శుక్రవారం ఉదయం 11.30కు ప్రధాని మోడీతో సమావేశం అవుతారు కేసీఆర్. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో పీఎం నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు తీసుకున్నాక.. ఆయనతో సీఎం భేటీ కావడం ఇదే తొలిసారి. విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి కేంద్ర సాయంపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా వంటి అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. యురేనియం తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న విషయాన్నీ ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం.
అమిత్ షాతోపాటు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్, పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్స్ ను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని అంశాలతోపాటు ఇతర అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలిసింది. హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు తీసుకున్నక సీఎం ఆయన్ను కలవలేదు. ఇటీవల ఢిల్లీలో షా అధ్యక్షతన జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సుకూ కేసీఆర్ పోలేదు. ఆయన స్థానంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ వెళ్లారు. ఈ నేపథ్యంలో అమిత్ షాను సీఎం వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలపనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ సీఎం భేటీ అవుతారు. బైసన్ పోలో గ్రౌండ్, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశముంది.
పలుచోట్ల రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించే అంశాన్నీ ఆయన దృష్టికి తీసుకుపోనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రాష్ట్రంలో నేషనల్ హైవేల విస్తరణపై రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనున్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజక్టులపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడే అవకాశముంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తి పోతలకు అనుమతులు, కేంద్ర నిధులను కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీలో సీఎం కోరనున్నారు. ఏపీకి గోదావరి నీళ్ల తరలింపుపై ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన చర్చలు, ఎదురవుతున్న సమస్యలు, పోలవరం ఎత్తు తగ్గింపు, కృష్ణానది జల వివాదాలు, గోదావరి-, కావేరి లింకు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే, దేవీ నవరాత్రుల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉండకపోవచ్చని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు సీఎంఓకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.